ప్రధాని మోడీకి చుక్కెదురైంది. మేఘాలయలోని స్టేడియంలో ప్రధాని మోడీ ర్యాలీకి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుమతి నిరాకరించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సంచలనంగా మారింది. మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కె సంగ్మా సొంత నియోజకవర్గమైన సౌత్ తురాలోని పీఏ సంగ్మా స్టేడియంలో మోడీ ఎన్నికల ర్యాలీని నిర్వహించేందుకు బీజేపీకి మేఘాలయ క్రీడా విభాగం అనుమతి నిరాకరించింది.
ఫిబ్రవరి 24వ తేదీన షిల్లాంగ్, తురాలో ప్రధాని ఎన్నికల ప్రచారం నిర్వహించాల్సి ఉంది. అయితే స్టేడియంలో ఇంత పెద్ద సమావేశాన్ని నిర్వహించడం సరికాదని మేఘాలయ క్రీడా విభాగం పేర్కొంది. స్టేడియంలో నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతున్నందున సైట్ లో ఉంచిన మెటీరియల్ భద్రత కోసం సభకు అనుమతించడం లేదని చెప్పారు.
అందువల్ల ప్రత్యామ్నాయ వేదిక అలోట్ గ్రే క్రికెట్ స్టేడియంలో సభ అనుమతి విషయమై పరిశీలిస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి స్వప్నిల్ టెంబే తెలిపారు. రూ.127 కోట్లతో నిర్మించిన ఈ స్టేడియాన్ని గతేడాది డిసెంబర్ 16న సీఎం కాన్రాడ్ ప్రారంభించారు.
ఈ విషయంపై బీజేపీ నేతలు మండి పడుతున్నారు. ప్రధాని మోడీ ర్యాలీని అడ్డుకునేందుకు సాకులు చెబుతున్నారంటూ ఫైర్ అవుతున్నారు. ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా, ముకుల్ సంగ్మా మమ్మల్ని చూసి భయపడుతున్నారా? మేఘాలయలో బీజేపీ వేవ్ ను అరికట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు ప్రధానమంత్రి ర్యాలీని ఆపడానికి ప్రయత్నించవచ్చు, కానీ రాష్ట్ర ప్రజలు బీజేపీకి మద్దతు ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రితురాజ్ సిన్హా దుయ్యబట్టారు.