మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని సోమవారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటలవరకు ఓటింగ్ సాగుతుంది. ఈ రెండు రాష్ట్రాల్లో సుమారు 59 అసెంబ్లీ నియోజకవర్గాల చొప్పున ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఓటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు.
మేఘాలయలో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తోంది. కాన్రాడ్ సంగ్మా నేతృత్వం లోని ఎన్ పీ పీ తో తెగదెంపులు చేసుకున్న అనంతరం ఈ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగాలని నిర్ణయించుకుంది. ఈ రాష్ట్రంలో ఇంకా కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేస్తున్న కారణంగా బహుళ పార్టీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.
నాగాలాండ్ లో 60 అసెంబ్లీ స్థానాలకు గాను 59 నియోజకవర్గాలకు ముక్కోణపు పోటీ పరిస్థితి నెలకొంది. 2018 లో 12 సీట్లు గెలుచుకున్న బీజేపీ.. నేషనలిస్ట్ డెమాక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగింది. మేఘాలయాలో ఉదయం 9 గంటల ప్రాంతానికి 10.6 శాతం పోలింగ్ నమోదయింది. మొదట తమ ఓటు వేసిన అయిదుగురు ఓటర్లకు అధికారులు మెమెంటోలను బహుకరించారు. ఈ రాష్ట్రంలో 3,419 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతోంది.
నాగాలాండ్ లో సుమారు 13 లక్షల మంది ఓటర్లు 183 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. ఈ రాష్ట్రంలో ఉదయం 9 గంటల ప్రాంతానికి 15.5 శాతం పోలింగ్ నమోదయింది. ఇక్కడ అకులుటో నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కినిమీని అప్పుడే విజేతగా ప్రకటించారు. భండారీ నియోజకవర్గంలో కొందరు రాళ్లు విసిరి ఎన్నికలకు అంతరాయం కలిగించడానికి యత్నించారని, అయితే పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసులు తెలిపారు. కోహిమాలో మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.