భారత్ జోడో యాత్ర కశ్మీర్‌లో కొనసాగుతోంది. పుల్వామా జిల్లాలో ఈ రోజు యాత్ర కొనసాగుతోంది. భద్రతా లోపాల నేపథ్యంలో భారత్ జోడో యాత్రను గురువారం రద్దు చేశారు. తాజాగా దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని అవంతిపురా నుంచి ఈ యాత్రను తిరిగి ప్రారంభించారు.
భద్రతా వైఫల్యాలపై కాంగ్రెస్ విమర్శల నేపథ్యంలో ఈ రోజు రాహుల్ యాత్రకు పోలీసుల పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఈ రోజు యాత్రలో జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ పాల్గొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి ఆమె పాదయాత్ర చేస్తున్నారు.
భారత్ జోడో యాత్రలో నిన్న భద్రతా వైఫల్యాలు కనిపించాయని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. రాహుల్ గాంధీ శ్రీనగర్‌కు వెళ్లే మార్గంలో బనిహాల్ సొరంగాన్ని దాటిన తర్వాత ఆయన్ని కలిసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు దూసుకు వచ్చారు. అదే సమయంలో అకస్మాత్తుగా భద్రతను అధికారులు ఉపసంహరించారని కాంగ్రెస్ పేర్కొంది.
దీనిపై కశ్మీర్ పోలీసులు స్పందించారు. యాత్రను రద్దుపై నిర్ణయం తీసుకునే సమయంలో కాంగ్రెస్ నేతలు తమను సంప్రదించలేదని పోలీసులు వెల్లడించారు. యాత్రలో ఎలాంటి భద్రతా వైఫల్యాలు లేవని తెలిపారు. మిగిలిన యాత్ర ప్రశాంతంగా కొనసాగుతుందన్నారు.