– భూ బకాసుర కంపెనీతో మేఘా డీల్?
– 5వేల కోట్ల స్కాం అటకెక్కించేందుకేనా?
– అమెరికా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్..,
– బిగ్గెస్ట్ కాంట్రాక్టర్ కృష్ణారెడ్డి ఒకే తాటిపై..
– బినామీలను పంపేందుకే చైనా కంపెనీతో టైయప్!
– మూడేళ్లలో ఒక్కో షేర్ విలువ ఎనిమిది రెట్ల పెంపు!
– క్విడ్ ప్రోకో అంటున్న ఆర్థిక నిపుణులు
– తొలివెలుగు క్రైం బ్యూరో స్పెషల్ రిపోర్ట్.. మేఘా బాగోతం పార్ట్-4
ఎకో ట్రావెల్స్ కోసం ఎలక్ట్రికల్ వాహనాలను తయారు చేయాలని కేంద్రం రాయితీలు ఇస్తోంది. టాటా లాంటి కంపెనీలు నష్టాలను భరిస్తూ ప్రజలకు ఈవీ కారులను అందుబాటులో ఉంచుతున్నాయి. కానీ.. ఎలక్ట్రికల్ బస్సులను తయారు చేసే కంపెనీలకు మాత్రం భారీగా లాభాలు వచ్చిపడుతున్నాయి. అయితే మేఘా కంపెనీ ఏ రంగంలో అడుగుపెట్టినా.. పాత సీసాలో కొత్త సారా అంటూ పనికిరాని దానికి అనుభవం అనే కలర్ పూసి అంతర్జాతీయ కంపెనీగా చెలామణీ చేస్తుందని విమర్శలు ఉన్నాయి. ఆఫీషియల్స్ నుంచి పొలిటికల్ లీడర్స్ వరకు లడాయి లేకుండా లాబీయింగ్ లతోనే కంపెనీలని లాభాల బాట పట్టిస్తుందని పేరుంది. ఈ బాగోతం బయట ప్రపంచానికి కనిపించకుండా మీడియా సంస్థలను సైతం మేనేజ్ చేస్తుందని వినికిడి. అందుకు నిదర్శనమే రిగ్గుల ఎలక్ట్రికల్ బస్సుల తయారీ కంపెనీ.
మోస్ట్ వాంటెడ్ గోల్డ్ స్టోన్ కి మేఘా బంపర్ ఆఫర్!
మియాపూర్ లోని 693 ఎకరాల ప్రభుత్వ భూములతో పాటు, ఇబ్రహీంపట్నంలోని దండుమైలారంలో 3వేల ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్స్ ని దొంగ పత్రాలు సృష్టించుకుని సిస్టర్ కంపెనీలకు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించి.. హైదరాబాద్ లో భారీ భూ కుంభకోణాలకు కారణమైన గోల్డ్ స్టోన్ ప్రసాద్ 2000వ సంవత్సరంలో హైదరాబాద్ లో గోల్డ్ స్టోన్ ఇన్ఫ్రా పేరుతో కంపెనీ ఏర్పాటు చేశాడు. అమెరికాలో బ్యాంకులను మోసం చేసిన కేసుల్లో ఇతను మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. అయినా మన దేశంలో నాయకులకు ఆమ్యామ్యాల ఆశ చూపించి.. అందరి ముందే అదృశ్య కబ్జాదారుడిగా ఎదిగాడు. 2017 మేలో ఇతని తమ్ముడు పీఎస్ పార్ధసారథి, కంపెనీ డైరెక్టర్ పీవీఎస్ శర్మ, రిజిస్ట్రార్ శ్రీనివాసరావులను మియాపూర్ ల్యాండ్ స్కాంలో సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే.. హైదరాబాద్ లో 10 వేల ఎకరాలు తనదే అంటూ దొంగ పత్రాలు సృష్టించి.. భూ బకాసురుడిగా మారిన గోల్డ్ స్టోన్ ప్రసాద్ కి మేఘా కృష్ణారెడ్డి లాబీయింగ్ మాస్టర్ గా తయారయ్యారు. అందుకు నిదర్శనం ఎలక్ట్రికల్ బస్సుల తయారీ కంపెనీనే.
గోల్డ్ స్టోన్ టూ మేఘా హోల్డింగ్ లిమిటెడ్ వయా ఒలెక్ట్రా!
2016 వరకు గోల్డ్ స్టోన్ ప్రసాద్ తన భూమి అంటూ.. అక్రమంగా వాటన్నంటినీ సిస్టర్ సంస్థలు అయిన ట్రినిటీ ఇన్ఫ్రా వెంచర్స్, గోల్డ్ స్టోన్ టెక్నాలజీలకు ప్రభుత్వ భూమిని అమ్మకం జరిపారు. అప్పటికే రబ్బర్, పవర్ ట్రాన్స్ మిషన్ తయారీలో గోల్డ్ స్టోన్ ఇన్ప్‌రా లిమిటెడ్.. ప్రపంచంలో ఎలక్ట్రికల్ బస్సులను తయారు చేసే చైనా కంపెనీ అయిన బైడ్ ఆటో ఇండ్రస్టీయస్ కో లిమిటెడ్ తో ఒప్పందం చేసుకుంది. 2017 మేలో తెలంగాణ పోలీసులు, ప్రభుత్వం గోల్డ్ స్టోన్ పై కేసులు పెట్టి అరెస్ట్ ల పర్వం కొనసాగించింది. అయితే డాక్టర్ ప్రసాద్ కళ్ల ముందే తిరుగుతున్నా.. అరెస్ట్ చేయకుండా మేఘా డీల్ చేసిందని తెలుస్తోంది. 18 సంవత్సరాల సీనియార్టీ ఉన్న కంపెనీని 2018 ఆగస్ట్ లో పేరు మార్చేశారు. ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ గా పెట్టారు. ఆ తర్వాత డిసెంబర్ 16న మేఘా హోల్డింగ్ లిమిటెడ్ కంపెనీ 51 శాతం షేర్స్ కొనుగోలు చేసింది.
ఒకే దెబ్బకు మూడు పిట్టలు!
మేఘా ఆలోచనలతో ఒకే దెబ్బకు మూడు పిట్టలు రాలాయి అంటున్నారు అర్థిక నిపుణులు. షేర్ విలువ కొద్దిరోజులకే 8 అంతలు అయింది. 175 రూపాయల 30 పైసలకు ఒక షేర్ ని కొనుగోలు చేస్తున్నట్లు బీఎస్ఈలో పెట్టారు. 2కోట్ల 37 లక్షల షేర్స్ ని 4 దఫాలుగా కొనుగోలు చేశారు. అందుకు కంపెనీ డైరెక్టర్స్ ఒప్పుకున్నట్లు లీగల్ గా ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలక్ట్రికల్ బస్సుల తయారీ సంస్థగా మేఘా కంపెనీ మేజర్ షేర్ తో ఎంటర్ అయింది. ఇప్పుడు ఒక్కో షేర్ విలువ 834 రూపాయలు ఉంది. అంటే తక్కువ ధరకు తీసుకుని ధరలు పెంచుకున్నారని తెలుస్తోంది. దీంతో పాటు.. గోల్డ్ స్టోన్ భూ కబ్జాలు బయటకు రాకుండా ఉండేందుకు ప్రభుత్వంలోని పెద్దలతో మేఘా డీల్ మాట్లాడుకుందని వినికిడి. అందుకే ప్లానింగ్ ప్రకారం బైడ్ అనే చైనా కంపెనీతో బస్సుల తయారీ ఒప్పందం చేసుకుని.. గోల్డ్ స్టోన్ ఇన్ఫ్రాని ఒలెక్ట్రాగా పేరు మార్పించి.. కృష్ణారెడ్డి పెట్టుబడుల రూపంలో కంపెనీని స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇదంతా క్విడ్ ప్రోకో తో పాటు బ్లాక్ మనీని.. వైట్ గా మార్చుకునేందుకు వీలుగా మారిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. లేకపోతే.. ఒక క్రిమినల్ కంపెనీని ప్లాన్ ప్రకారం అంతర్జాతీయ కంపెనీగా మార్చేసి.. నష్టాల్లో ఉన్న దాన్ని 2021 మూడో క్వార్టర్ ఫైనాన్స్ లో 226 శాతం లాభాల బాట పట్టించారంటే.. ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాలని అంటున్నారు విశ్లేషకులు.
డీల్ చేస్తే.. ఎదైనా వశం కావాల్సిందే!
మేఘా కంపెనీ ఎక్కడ, ఎప్పుడు డీల్ చేసినా.. అది ఒక వివాదమై ఉంటుంది. మొదటగా ఎలాంటి అభ్యంతరాలను అయినా తానే చూసుకుంటామని చెప్పి.. పెద్ద పెద్ద డీల్స్ పేరుతో ప్రపంచానికి తెలియకుండానే మొత్తం పిండేస్తుంది. అందుకే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నేత మియాపూర్ ల్యాండ్ స్కాంపై హైకోర్టులో కేసు వేశారు. కానీ ఇప్పటికీ అది బెంచ్ మీదకి రాలేదు. అడిషనల్ సమాచారం కోర్టుకు సమర్పించలేదు. మేఘా, గోల్డ్ స్టోన్ దోస్తానా వల్లే మొత్తం సైలెంట్ అయ్యారని విమర్శలు ఉన్నాయి. ఆ లీడర్ ఇటీవల ఎమ్మెల్యే కూడా అయ్యారు. మేఘా ఎంటర్ అయితే ఎంతటివారైనా డీల్ క్లోజ్ కావాల్సిందే అన్నట్లుగా వ్యవహరించడంతో.. డాక్టర్ ప్రసాద్ భూ కబ్జాలపై ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి. మొన్న ఆయిల్ వెలికి తీసే రిగ్గుల కంపెనీ.. డిఫెన్స్ కి అయుధాలు తయారు చేసేందుకు ఐకాం కంపెనీ పేరుతో 7 ఎకరాల చెరువు కబ్జా.. ఇప్పుడు ఎలక్ట్రికల్ బస్సుల తయారీ కంపెనీ.. ఇలా తొలివెలుగు క్రైం బ్యూరో ఇన్వెస్టిగేషన్ లో మేఘా మోసాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.