– ఎన్నారై కాలేజ్ పై కన్నేసిన మేఘా!
– సేవ ముసుగులో ‘కృష్ణ’ మాయ!
– వేల కోట్ల కాలేజ్ ని 2వందల కోట్లతోనే కబ్జా!
– ప్రశ్నిస్తున్న సొసైటీ సభ్యులపై అక్రమ కేసులు
– కోర్టులు చెప్పినా వినని వైనం!
– హార్డ్ క్యాష్ కోసమేనా ఈ దందా?
– చిన కాకానిలో పెద్ద పంచాయితీ!
– తొలివెలుగు క్రైంబ్యూరో స్పెషల్ రిపోర్ట్
– మేఘా బాగోతం పార్ట్-5
దశాబ్దకాలం తిరగక ముందే లక్షల కోట్ల టర్నోవర్ కి చేరుకున్న మేఘా కంపెనీ మనసు మెడికల్ బిజినెస్ పై పడింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ నిధులు ఖర్చు చేసినట్లు చూపించేందుకు.. ఓ ఎడ్యుకేషనల్ సొసైటీ కింద రిజిస్ట్రేషన్ అయిన మెడికల్ కాలేజీ కావాలి.. సేవ పేరుతో వైట్ మనీ ఖర్చు చేస్తున్నట్లు చూపించి.. నగదు రూపంలో ఏటీఎంలా ఎప్పుడంటే అప్పుడు తీసుకెళ్లవచ్చనే ప్లాన్ వేసింది మేఘా. ఇంకేముంది ఎన్నో కంపెనీలను తన పేరుమీదకు మార్చుకున్న మేఘా కళ్లు విజయవాడ, గుంటూరు మధ్యలో ఉన్న 50 ఎకరాల సువిశాలమైన ఎన్నారై అకాడమీపై పడింది. అప్పటికే ఎంతో అద్భుతంగా నడుస్తున్న కాలేజ్ ని వశం చేసుకోవాలని శ్రీచైతన్య కాలేజ్ ల యాజమాన్యం బేరసారాలు జరిపింది. మధ్యవర్తిగా వ్యవహరించిన లింగమనేని రమేష్ ప్లేట్ ఫిరాయించి తనకు కాంట్రాక్టులు ఇప్పించే మేఘాకి కబ్జా ఎలా చేయాలో పక్కా ప్లాన్ గీసి ఇచ్చారు.
ఎంతోమంది ఎన్నారైల కల.. ఈ మెడికల్ కాలేజ్
విదేశాల్లో మంచి జీతాలతో జీవితం హ్యాపీగా గడుపుతున్న 24 మంది డాక్టర్స్.. జన్మనిచ్చిన గడ్డ రుణం తీర్చుకునేందుకు 2003లో మంగళగిరికి దగ్గరలోని చినకాకానిలో 50 ఎకరాల విస్తీర్ణంలో మెడికల్ కాలేజీ అనుమతులు తీసుకున్నారు. ఎక్కడెక్కడో హై ప్రొఫైల్ ప్రొఫెసర్స్ ఉన్నారో వారందరినీ ఎక్కవ జీతాలు ఇచ్చి కాలేజ్ లో స్టాఫ్ గా నియమించుకున్నారు. మొదటి ఏడాదిలోనే సూపర్ రిజల్ట్స్ వచ్చాయి. ఐదేళ్ల తర్వాత స్టూండెట్స్ సంఖ్య పెరిగింది. పీజీ కోర్సులకు అనుమతులు వచ్చాయి. ఎన్నారై కాలేజ్ లో మెడికల్ సీట్ దొరకాలంటే అదో బ్రహ్మాండం అనుకునేవారు. ఏడేళ్లలోనే రోజుకు వెయ్యి మంది రోగులకు వైద్యం అందించే స్థాయికి ఎదిగింది. సౌకర్యాలు కూడా అలా పెంచేందుకు పార్టనర్స్ సంఖ్య 30కి పెరిగింది.
చక్రం తిప్పిన లింగమనేని!
ఏ ప్రభుత్వం ఉన్నా గిఫ్టులు ఇచ్చి పనులు చేయించుకోవడంలో దిట్ట లింగమనేని రమేష్. ఇంటర్ బైపీసీలో నెంబర్ వన్ అయిన శ్రీచైతన్య కాలేజ్.. ఎన్నారై అకాడమీని కొనాలని విశ్వ ప్రయత్నాలు చేసింది. అందుకు లింగమనేని మధ్యవర్తిత్వం చేశారు. 2015లో 8 మంది డైరెక్టర్స్ కి 11 కోట్ల చొప్పున సుమారు 100 కోట్లు చేతులు మారాయి. జనరల్ బాడీ మీటింగ్ లోకి ఎవరిని రానివ్వకుండా డోర్స్ మూసి సొసైటీ మేనేజింగ్ కమిటీలో వారిదే పైచేయి ఉండేలా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇదంతా సొసైటీ రూల్స్ కి విరుద్ధంగా జరగడంతో అధిక మెజార్టీ ఉన్నవారు లింగమనేని తీరుని దుయ్యబట్టారు. శ్రీచైతన్యకి తిరిగి డబ్బులు ఇచ్చేలా ఫౌండర్స్ సభ్యులు ఒప్పందం చేసుకున్నారు. 2018, 2020లో ఫౌండర్ సభ్యుల టీం పాలకమండలిగా ఏర్పడింది. అప్పటికే సభ్యుల మధ్య లుకలుకలు ఉండటంతో లింగమనేని తమ మెడికల్ కాలేజ్ ని కాజేసేందుకు పక్కా ప్లాన్ వేశారని ఫౌండర్ సభ్యులు విమర్శలు చేశారు. మేఘా కృష్ణారెడ్డి, లింగమనేని మధ్య బిజినెస్ డీలింగ్స్ ఉన్నాయి. దీంతో 2019 నుంచి మేఘా సంస్థకి కాలేజ్ ని కబ్జా చేసేలా సభ్యుల మధ్య వివాదాలను సృష్టించారు. విదేశాల్లో ఉన్నవారికి అక్రమంగా షెల్ కంపెనీల ద్వారా డబ్బులు పంపించారని తెలుస్తోంది.
మేఘా కబ్జా ఇలా..!
మేఘా సంస్థ అక్రమంగా చొరబడేందుకు 12 మంది సభ్యులను రూ.14 కోట్ల చొప్పున ఇచ్చి తనవైపు తిప్పుకుంది. అయితే.. అందులో రూల్స్ కు విరుద్ధంగా నియమాకం అయినవారే ఎక్కువగా ఉన్నారు. అప్పటికే కోవిడ్-19 కేసులు పెరగడం.. ఎన్నారైకి మరింత మంచి పేరు రావడంతో మేఘా డీల్ ని వదులుకోలేకపోయారు. నిత్యం హార్డ్ క్యాష్ కనిపించడంతో.. రాజకీయ నాయకులకు అవసరమవుతున్నందున కాలేజ్ పై పట్టు పెంచుకోవాలని చూశారు. అనధికారికంగా సీఈవో పనులు చక్కబెడుతున్నారు. సీఎఫ్ఓని నియమించుకున్నారు. 2020లో జనరల్ బాడీ మీటింగ్ లో పాత కమిటీ మళ్లీ ఎన్నికైంది. 2022 మార్చి వరకు ఇది కొనసాగాలి. అయితే.. అప్పటికీ తన చేతిలోకి రాలేదని మేఘా టీం విశ్వరూపం చూపించింది. కోవిడ్ సమయంలో ఎక్కవ డబ్బులు వసూలు చేస్తున్నారని కేసులు పెట్టించారు. నిధుల దుర్వినియోగం కింద డాక్టర్ శ్రీనివాస్ తో పాటు అప్పటి సీఎఫ్ఓని అరెస్ట్ చేశారు. పోటీగా సొసైటీకి మరో పాలక మండలిని నియమించారు. ఆ ఎగ్జిక్యూటివ్ బాడీలో ముగ్గురు సభ్యులు అనర్హులే. డబ్బుల వ్యవహారం చూసే ట్రెజరరీ సీటీ చౌదరీని సభ్యుడుగా అర్హుడు కాదని సివిల్ కోర్టు తీర్పునిచ్చింది. కానీ.. అతన్నే కోశాధికారిగా కొనసాగించడం మేఘాకే చెల్లుతుంది. ఇప్పుడు ఎనిమిది నెలలుగా అక్కడ జరిగే అర్థిక లావాదేవీలు అన్నీ వారి కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. ఇటీవల ఓ రాజకీయ నాయకుడికి 23 కోట్ల రూపాయల నగదు కావాలంటే.. ఈ ఆస్పత్రి నుంచే సమకూర్చారని ఆరోపణలు ఉన్నాయి. రాఘవరావు నేతృత్వంలో ఉన్న కమిటీ డబ్బులు రూపంలో కాకుండా కేవలం బ్యాంకు ద్వారానే బదిలీలు చేయాలని మెడకల్ విద్యార్థులకు, రోగులకు పేపర్ ప్రకటన ద్వారా ప్రచారం చేశారు. అయినా నిధుల గోల్ మాల్ ఆగడం లేదని తెలుస్తోంది.
సొసైటీ రిజిస్ట్రార్ కి హైకోర్టు మొట్టికాయలు
కార్పొరేట్ సంస్థల ఒత్తిళ్లకు తలొగ్గి మేఘా సంస్థకు చెందినవారికి అనుకూలంగా సొసైటీ రిజిస్ట్రార్ వ్యవహరించారు. దీంతో హైకోర్టు రిజిస్ట్రార్ కు మొట్టికాయలు వేసింది. వార్షిక నివేదికల ఆమోదం, సభ్యుల సవరణ జాబితాను ఆమోదించడం, తిరస్కరించడమనేది సొసైటీ రిజిస్ట్రార్ పని కాదని స్పష్టం చేసింది జస్టిస్ సోమయాజులు బెంచ్. మంతెన నరసరాజు సమర్పించిన సవరణను ఆమోదించడాన్ని తప్పుపట్టింది. ఎండార్స్ మెంట్ ని రద్దు చేసింది. ఇరుపక్షాలు సమర్పించిన జాబితాలు కోర్టు ఇచ్చే తుది తీర్పుకు లోబడి ఉండాలని ఆదేశించింది. చట్ట ప్రకారం ఉన్న ప్రత్యామ్నాయాలను, న్యాయపరమైన మార్గాలను అన్వేషించుకోవాలని సూచించింది. ఈ వ్యవహారంలో అనేక వివాదస్పదమైన చిక్కులు ఉన్నా.. వాటి జోలికి వెళ్లకుండా తీర్పునిస్తున్నామని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
పోలీసుల ఒత్తిళ్లు..!
రూ.1,500 కోట్ల విలువ చేసే మెడికల్ కాలేజ్ కి మేఘా సంస్థ రూ.200 కోట్లు ఖర్చు చేసింది. మిగతా కొంతమందికి షెల్ కంపెనీలతో నగదు బదిలీ చేసింది. ఎన్నో లాభాలు ఉన్న మెడికల్ కాలేజ్ ని కొల్లగొట్టేందుకు పోలీసుల ద్వారా ఒత్తిళ్లకు ప్రయత్నిస్తోంది. సభ్యులపై ఇప్పటికే 4 కేసులు నమోదు చేయించింది. అమెరికాలో ఉన్నా.. ఇబ్బందులకు గురిచేస్తోంది. సీసీఎస్ లో ఓ ఏసీపీ స్థాయి అధికారిని కేవలం ఈ కాలేజ్ వ్యవహారం కోసమే పెట్టినట్లు సమాచారం. మెడికల్ కాలేజ్ ని కబ్జా చేసిన మేఘా సంస్థ. లీగలైజేషన్ చేసుకునేందుకు చేయని ప్రయత్నం లేదు. ఇప్పటికే చాలా కంపెనీలను కబ్జా చేశారని ఆరోపణలు ఉన్న మేఘాపై నిధుల వ్యవహారంలో సరైన దర్యాప్తు జరిగితే అన్ని విషయాలు బయటపడతాయి.
ఐసీఐసీఐ బ్యాంకు అధికారుల తీరే వేరు..!
కోర్టు ఆదేశాల మేరకు అన్ని బ్యాంకులు సొసైటీ లావాదేవీలను నిలిపివేసి.. అకౌంట్స్ ని ఫ్రీజ్ చేశాయి. కానీ.. ఐసీఐసీఐ ఎన్నారై బ్రాంచ్ అధికారులు మాత్రం మేఘా ఒత్తిళ్లకు తలొగ్గి.. ఇష్టానుసారంగా అక్రమాలకు తెరలేపే విధంగా వ్యవహారిస్తున్నారు. దీంతో సొసైటీ ఫౌండర్ మెంబర్స్ బ్యాంకు తీరుపై కోర్టును ఆశ్రయించారు.