దావోస్ పర్యటనలో మంత్రి కేటీఆర్ స్టాడ్లర్ రైల్ కంపెనీ మార్కెటింగ్ మేనేజర్ అన్స్ గార్డ్ బ్రోక్ మెయ్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదిరింది.
తెలంగాణలో ఉన్న మేదో సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్, స్టాడ్లర్ రైల్ కలిసి ఈ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ని స్థాపించనున్నాయి. ఒప్పందం ప్రకారం రానున్న రెండు సంవత్సరాలలో వెయ్యి కోట్ల రూపాయలను రైల్వే కోచ్ ఫ్యాక్టరీ స్థాపన కోసం సదరు కంపెనీ పెట్టుబడిగా పెట్టనుంది. ఈ కంపెనీ ఫ్యాక్టరీ స్థాపన తర్వాత తయారుచేసే రైల్వే కోచ్ లను కేవలం దేశం కోసం మాత్రమే కాకుండా ఏసియా పసిఫిక్ రీజియన్ కోసం సైతం ఎగుమతి చేయనున్నారు.
ఒప్పందానికి సంబంధించిన విషయాలను కేటీఆర్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఈ కోచ్ తయారీ యూనిట్ ద్వారా రాష్ట్రంలో 2,500 మందికి ఉద్యోగాలు లభించనున్నాయని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రం నుంచి భారతదేశానికే కాకుండా విదేశాలకు సైతం ఎగుమతి అయ్యేలా రైల్వే కోచ్ లను తయారు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందంతో ప్రపంచ పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామంగా మారనుందని వెల్లడించారు.
ఇక తెలంగాణలో ఏర్పాటు చేయబోతున్న తమ యూనిట్.. కంపెనీకి అత్యంత ప్రాధాన్యత కలిగిందిగా మారబోతోందని అన్స్ గార్డ్ బ్రోక్ మెయ్ తెలిపారు. తమ కంపెనీ ఏసియా పసిఫిక్ ప్రాంతంలో అభివృద్ధిని సాధించేందుకు ఈ పెట్టుబడి దోహదపడుతుందన్నారు.