బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జనాభా నియంత్రణ నియంత్రణపై ఆయన చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఈ వ్యాఖ్యలపై బీజేపీ, ఇతర విపక్షాలు నితీష్ కుమార్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ఇంతకు ఆయన ఏమన్నారంటే…
వైశాలిలో నిర్వహించిన ఓ సభలో ఆయన మాట్లాడుతూ… జనాభా నియంత్రణ విషయంలో మగాళ్లు బాధ్యతగా ఉండరని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో మహిళలకు సరైన అవగాహన లేదన్నారు. అందువల్లే జనాభా సమస్య ఉత్పన్నమవుతోందని చెప్పారు.
మగాళ్లకు అసలు ఏమీ పట్టదన్నారు. వారి చర్యల వల్ల ఎలాంటి పరిణామాలు జరుగుతాయనే విషయాన్ని వారు అసలు ఆలోచించరని చెప్పారు. దానిపై మహిళలకు సరైన అవగాహన ఉండదన్నారు. మహిళల వద్దని చెప్పకపోవడంతోనే జనాభా నియంత్రణ జరగడం లేదన్నారు.
మహిళల్లో అవగాహన పెరిగినప్పుడే జనాభా నియంత్రణ సాధ్య పడుతుందన్నారు. గర్భం దాల్చకుండా ఎలా తమను తాము రక్షించుకోవాలో మహిళలు తెలుసుకోవాలన్నారు. దీనిపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
బిహార్ రాష్ట్ర ప్రతిష్ఠను సీఎం నితీష్ కుమార్ ఘోరంగా దిగజార్చారని బీజేపీ నేత సామ్రాట్ చౌదరి తీవ్రంగా విమర్శించారు. సీఎం హోదాలో ఉండి అలాంటి భాష వాడటం చాలా దారుణమైన విషయమన్నారు. ముఖ్యమంత్రి పదవికి నితీశ్ కుమార్ మచ్చ తెస్తున్నారని మండిపడ్డారు.