పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు తీర్పు నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన ఎంపీ పదవిని కోల్పోయారు. దీంతో ఎంపీగా ఉన్నప్పుడు ఆయనకు కేటాయించిన అధికారిక బంగ్లాను ఖాళీ చేయాలంటూ రాహుల్ గాంధీకి అధికారులు నోటీసులు ఇచ్చారు.
ఈ క్రమంలో రాహుల్ గాంధీకి పలువురు మద్దతుగా నిలుస్తున్నారు. తాజాగా యూపీలోని వారణాసికి చెందిన కాంగ్రెస్ నేత అజయ్ రాయ్ ఢిల్లీలోని తన పూర్వీకుల ఇంటిని రాహుల్ గాంధీకి అంకితం ఇచ్చారు. తమ ఇంటికి రావాలంటూ రాహుల్ గాంధీకి స్వాగతం పలికారు.
‘మేరా ఘర్ శ్రీ రాహుల్ గాంధీజీ కా ఘర్’ అంటూ ఫోటోతో కూడిన నేమ్ ప్లేట్ వేయించారు. మరోవైపు నిన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇలాంటి ప్రకటనే చేశారు. రాహుల్ గాంధీని తన ఇంటికి రావాలని రేవంత్ రెడ్డి నిన్న ట్వీట్ లో ఆహ్వానించారు.
‘రాహుల్ భయ్యా.. నా ఇల్లు.. ఇక మీ ఇల్లు.. నా ఇంటికి మీకు స్వాగతం పలుకుతున్నాను. మన మంతా ఒకే కుటుంబం. ఇది మీ ఇల్లు కూడా’అని ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు. దీంతో పాటు అధికారులకు రాహుల్ గాంధీ రాసిన లేఖను ట్యాగ్ చేశారు.