టీమ్ ఇండియా క్రికెటర్ రిషబ్ పంత్ ఇటీవల కారు ప్రమాదంలో గాయపడ్డారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగవుతోందని వైద్యులు చెబుతున్నారు. ఇది ఇలా వుంటే అసలు ప్రమాదం జరిగిన తర్వాత ఏం జరిగిందనే విషయాన్ని పంత్ ను కాపాడిన రోడ్ వేస్ డ్రైవర్ సుశీల్ కుమార్ వివరించారు. తాను పంత్ ను ఎలా కాపాడానో ఆయన తాజాగా ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ప్రమాదాన్ని గమనించి తాను వెంటనే కారు వద్దకు చేరుకున్నట్టు ఆయన చెప్పారు. పంత్‌ను కారు నుంచి బయటకు తీసి రోడ్డు మీద పడుకోబెట్టానని తెలిపారు. వెంటనే పంత్ స్పృహలోకి వచ్చాడన్నారు. దీంతో కారులో ఇంకెవరైనా ఉన్నారా అంటూ పంత్ ను అడిగానన్నారు.
దానికి ఆయన ఒంటరిగానే వచ్చానని బదులిచ్చారన్నారు. మొబైల్ తీసివ్వాలని పంత్ తనకు సైగ చేశారన్నారు. వెంటనే తన తల్లికి ఫోన్ చేయాలని అస్పష్టంగా చెప్పాడన్నారు. నంబర్ డయల్ చేస్తే ఆమె నంబర్ స్విచ్ఛాఫ్ వచ్చిందన్నారు. దీంతో వెంటనే పోలీసులు, అంబులెన్స్‌కు ఫోన్ చేశానని వెల్లడించాడు.
ఆ సమయంలో తనకు పంత్ ఎవరో తెలియదన్నారు. తాను క్రికెట్ చూడను కాబట్టి ఆయన్ని గుర్తు పట్టలేకపోయానన్నారు. కానీ మానవతా దృక్ఫథంతో సాయం చేశానని ఆయన అన్నారు. ఆ ఘటనలో వేరే ఎవరున్నా కూడా తాను వారిని కాపాడేవాడినన్నారు.