నాగోబా జాతర మహాపూజకు ఏర్పాట్లు చక చకా జరుగుతున్నాయి. ఇప్పటికే మహాపూజకు కావాల్సిన గంగా జలం కోసం మెస్రం వంశీయులు గత నెల 28న హస్తినమడుగు బయలు దేరారు. తాజాగా ఈ రోజు మెస్రం వంశీయులు హస్తిన మడుగుకు చేరుకున్నారు.
గంగాదేవికి ఈ రోజు మెస్రం వంశీయులు పూజలు నిర్వహించారు. అనంతరం పవిత్రమైన గంగా జలాన్ని వారు సేకరించారు.అనంతరం వారు తిరుగు పయనం అయ్యారు. ఉట్నూర్‌లో బస చేస్తామని, 11న దోడందా, 12 నుంచి 16 వరకు విశ్రాంతి తీసుకుంటామన్నారు.
17న ఇంద్రవెల్లిలోని ఇంద్రాయి ఆలయానికి చేరుకుంటామన్నారు. అక్కడ పూజలు చేస్తామని చెప్పారు. ఆ రోజు సాయంత్రమే కేస్లాపూర్‌లోని వడమర(మర్రిచెట్టు) వద్దకు చేరుకుంటామని వెల్లడించారు. అక్కడ చెట్టు వద్ద మూడు రోజులు బస చేస్తామన్నారు.
అనంతరం 21న ఆలయ సమపంలోని గోవ్వాడ్‌కు చేరుకుంటామని పేర్కొన్నారు. ఆ రోజు రాత్రే నాగోబా ఆలయంలో మహాపూజలు నిర్వహిస్తామని చెప్పారు. ఆ తర్వాత జాతరను ప్రారంభిస్తామన్నారు.