మాజీ ఫుట్ బాల్ దిగ్గజం డిగో మారడోనాకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు, ఫుట్ బాల్ క్రీడాకారులు నివాళులు అర్పిస్తూనే ఉన్నారు. మారడోనాతో వారు తమకు ఉన్న అభిమానాన్ని వారు గుర్తు చేసుకుంటున్నారు. ఇక ప్రముఖ ఫుట్ బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ కూడా మారడోనాకు ఇది వరకే నివాళులు అర్పించాడు. కానీ మరోసారి ఆ పనిచేసి చిక్కుల్లో పడ్డాడు. ఫలితంగా నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చింది.
తాజాగా ఒసాసునా టీంతో జరిగిన ఫుట్ బాల్ లీగ్ మ్యాచ్‌లో మెస్సీ ఆడిన బార్సిలోనా జట్టు 4-0 తేడాతో విజయం సాధించింది. అయితే ఆ మ్యాచ్ సందర్భంగా మెస్సీకి రిఫరీ ఎల్లో కార్డ్ చూపించాడు. అంతేకాదు, మెస్సీకి 600 యూరోలు, అతని జట్టు బార్సిలోనాకు 180 యూరోలు మొత్తం కలిపి 780 యూరోలను ఫైన్ విధించారు. స్పెయిన్ సాకర్ ఫెడరేషన్ కాంపిటీషన్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
అయితే మెస్సీకి, అతని టీంకు ఫైన్ పడేందుకు గల కారణం.. అతను మ్యాచ్ సందర్భంగా షర్ట్‌ను పైకి లిఫ్ట్ చేసి మారడోనాకు నివాళి అర్పించాడు. అందుకనే అతనికి, అతని టీంకు జరిమానా విధించారు. అయితే అతని టీం మేనేజ్‌మెంట్ సదరు కమిటీకి జరిమానాను మాఫీ చేయాలని కోరింది. మెస్సీ కావాలని ఆ పనిచేయలేదని, మారడోనాకు నివాళులు అర్పించేందుకు ఆ పనిచేశాడు కనుక ఈ సారికి వదిలేయాలని కోరింది.
కానీ కమిటీ మాత్రం బార్సిలోనా విజ్ఞప్తిని పట్టించుకోలేదు. మెస్సీ చేసింది మంచి పనే అయినా డిసిప్లినరీ కోడ్ ఆర్టికల్ 93 ప్రకారం అతను నిబంధనలను ఉల్లంఘించాడని కనుక జరిమానా తప్పనిసరి అని తెలిపింది. కాగా మారడోనా చనిపోయినప్పుడే మెస్సీ నివాళులు అర్పించినా ఇప్పుడు ఈ రకంగా మళ్లీ మారడోనాను గుర్తుకు తెచ్చుకోవడంపై అభిమానులు మెస్సీకి అభినందనలు తెలుపుతున్నారు.