హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. తెల్లవారు జాము నుంచి బాలానగర్, బేగంపేట, కుత్బుల్లాపూర్, అమీర్ పేట, పంజాగుట్ట, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌తో పాటు నగరంలో పలుచోట్ల వరుణుడు పలకరించాడు.
ఒకవైపు చలిగాలులతో ఉదయం ప్రజలు బయటకు రావడం లేదు, చలికి వర్షం తోడు అవ్వడంతో చలి తీవ్రత మరింత పెరిగింది. వర్షం ప్రభావంతో చలి తీవ్రత మరింత పెరగవచ్చని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.
గురువారం రామగుండంలో 1.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రామగుండంలో కనిష్ట ఉష్ణోగ్రత 19.6 డిగ్రీల సెల్సియస్ నమోదవ్వగా.. గరిష్ట ఉష్ణోగ్రత 30.0 డిగ్రీలు నమోదైంది.
నిజామాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 20, గరిష్ట ఉష్ణోగ్రత 30, నల్లగొండలో కనిష్ట ఉష్ణోగ్రత 18, గరిష్ట ఉష్ణోగ్రత 29.5 డిగ్రీలు నమోదైంది. మెదక్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీలు, గరిష్ట ఉష్ణోగ్రత 30.6 డిగ్రీలు నమోదైంది. ఇక మహబూబ్ నగర్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 19.6, గరిష్టం 30.1గా నమోదవ్వగా.. ఖమ్మంలో కనిష్ట ఉష్ణోగ్రత 21.0, గరిష్ట ఉష్ణోగ్రత 32.0 డిగ్రీలుగా నమోదైంది.