ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో న్యూ ఇయర్ సందర్భంగా గుడ్ న్యూస్ చెప్పింది. డిసెంబర్ 31 అర్థరాత్రి 2 గంటల వరకు మెట్రో సేవలను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా టైమింగ్స్ పెంపు నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
రేపు రాత్రి 1 గంటలకు మొదటి స్టేషన్ నుంచి చివరి మెట్రో రైలు స్టార్ట్ అవుతుందని తెలిపారు. మందుబాబులు మెట్రోలో తోటి ప్రయాణికులకు ఇబ్బంది పెడితే..కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, ప్రస్తుతం మెట్రో సేవలు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉండగా..న్యూ ఇయర్ సందర్భంగా మరో మూడు గంటలు అదనంగా పెంచారు.
ఇక హైదరాబాద్ పోలీసులు న్యూఇయర్ వేడుకలకు ఆంక్షలు విధించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే కఠిన చర్యలు తప్పవని చెప్పారు. దీంతో పాటు న్యూ ఇయర్ ఈవెంట్ల నిర్వాహకులు తప్పని సరిగా పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాలని పోలీస్ బాస్ సివి ఆనంద్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. 31 రాత్రి హోటల్స్, పబ్స్, క్లబ్స్ అర్థరాత్రి ఒంటిగంట వరకే పని చేయాలని ఆయన తెలిపారు.
సీసీ కెమెరాలు అవసరమైన స్థాయిలో, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు, తగినంత పార్కింగ్ స్థలం ఖచ్చితంగా ఉండాలని పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో జరిగే ఈవెంట్లలో డీజే తదితరాలకు అనుమతి లేదన్నారు. కార్యక్రమం జరిగే ప్రాంతం నుంచి బయటకు శబ్దం వినిపించకూడదన్నారు. దీన్ని అతిక్రమించి ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే తీవ్రంగా పరిగణిస్తామని పోలీసులు హెచ్చరించారు.