దేశంలో మెట్రో మ్యాన్ గా గుర్తింపు పొందిన వ్యక్తి ఆర్. శ్రీధరన్. దేశంలో మెట్రో రైళ్ల కాన్సెప్ట్ ను విస్తృత పరిచి, వేగంగా ప్రాజెక్టులు పూర్తవ్వటంతో ఈయన సేవలు ఎన్నో. ఈయన ఆద్వర్యంలోనే కొంకణ్ మెట్రో, ఢిల్లీ మెట్రో ప్రాజెక్టులు పట్టాలెక్కాయి. నత్తనడకన సాగుతున్న లక్నో మెట్రో ప్రాజెక్టును పరుగులు పెట్టించింది కూడా శ్రీధరనే.
2014లో టీడీపీ తెలంగాణలో బీసీ కార్డుతో పోటీ చేసింది. రాష్ట్ర విభజన అంశం, ఏపీలో చంద్రబాబు రాజకీయ ప్రచారం దృష్ట్యా ఇబ్బందికాకుండా ఉండేందుకు బీసీ సంఘాల నేత ఆర్.కృష్ణయ్యను బరిలోకి దించారు. ఫలితం తెలిసిందే. జస్ట్ అలా తమది ఓ ప్రయత్నం. ఇప్పుడు కేరళలోనూ బీజేపీ ఇదే ఫార్మూలాతో వెళ్తుంది. అక్కడ విద్యావంతులు ఎక్కువ కాబట్టి కుల సంఘాలు, మత అంశాలను కాకుండా మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను ఏకంగా సీఎం అభ్యర్థిగా ప్రచారం చేస్తుంది. కేరళ అభివృద్ధిని మెట్రో రైలు వలే పరుగులు పెట్టిస్తారన్నది వారి వాదన.
నిజానికి శ్రీధరన్ కాంగ్రెస్ హాయంలో ఓ వెలుగు వెలిగారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆయన ప్రభ తగ్గుతూ వచ్చింది. లక్నో మెట్రో ఓపెనింగ్ ప్రోగ్రాంలో అయితే తనను ఓ మూల నిలబెట్టారు. అప్పట్లో ఆ వీడియోలు, ఫోటోలు వైరల్ అయ్యాయి కూడా. కానీ సడన్ గా కేరళలో వామపక్ష కూటమిని కొట్టేందుకు శ్రీధరన్ ను తెరపైకి తెచ్చారు. బీజేపీ ఇలాంటి ఎత్తులు వేయటం కొత్తేమీ కాదు. అవినీతిపై ప్రభుత్వ ఉదాసీనత ఉద్యమం తర్వాత ఢిల్లీలో కేజ్రీవాల్ అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత కొన్ని రోజులకే ఎన్నికలు రాగా… బీజేపీ కిరణ్ బేడీని సీఎం అభ్యర్థిగా ప్రచారం చేసింది. ఆ ఫలితం కూడా అందరికీ తెలిసిందే.
నిజానికి బీజేపీ శబరిమల గుడిలోకి మహిళల ప్రవేశం వివాదం తర్వాత తమకు స్పేస్ దొరకుతుందని ఆశించింది. కానీ కేరళలో ఆ పాచిక పారలేదు. మరిప్పుడు డెవలప్మెంట్ కార్డు అయినా ఎంతవరకు పనిచేస్తుందో చూడాలి.