బెంగళూరులో విషాదం చోటు చేసుకుంది. నగావర ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న మెట్రోపిల్లర్ కూలి బైక్ పై వెళుతున్న వారిపై పడింది. ఈ ఘటనలో తల్లి, ఆమె మూడేండ్ల కుమారుడు మరణించాడు. దీంతో పాటు మరో వ్యక్తి గాయాల పాలయ్యాడు. ఈ ఘటన ఈ రోజు ఉదయం చోటు చేసుకుంది.
ఓ వ్యక్తి తన భార్యా బిడ్డలతో కలిసి బైక్ పై వెళుతున్నాడు. ఉదయం 10.45 గంటల ప్రాంతంలో నగవర ప్రాంతంలోకి చేరుకోగానే మెట్రోపిల్లర్ కూలి బైక్ పై వెళుతున్న వారిపై పడింది. దీంతో వారికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
చికిత్స పొందుతు తేజస్విని(28) ప్రాణాలు కోల్పోయింది. ఆమెతో పాటు మూడేండ్ల కుమారుడు విహాన్ కూడా మరణించాడు. భర్త, కూతురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు
అధికారులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల తొలగింపు నేపథ్యంలో సుమారు మూడు కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇది ఇలా వుంటే ఇప్పటి వరకు దీనిపై మెట్రో సంస్థ స్పందించక పోవడం గమనార్హం.