మెట్రో స్టేషన్లకు రిపేర్లు-తొలివెలుగు వార్తలకు స్పందన - Tolivelugu

మెట్రో స్టేషన్లకు రిపేర్లు-తొలివెలుగు వార్తలకు స్పందన

తొలివెలుగు కథనానికి మంత్రి కేటీఆర్ స్పందించారు. అమీర్‌పేట్‌ మెట్రోస్టేషన్‌లో జరిగిన ఘటన జరిగి పది రోజులు కావస్తున్నా ఇంకా మరమ్మత్తులు నోచుకోకపోవటంపై తొలివెలుగు వరుస కథనాలతో మెట్రో వాళ్లని మొద్దు నిద్ర లేపేందుకు ప్రయత్నించింది. వీటిపై మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. తక్షణం మెట్రో స్టేషన్లకు రిపేర్లు చేయాలని ఆదేశించారు. కేటీఆర్ ఆదేశాలతో ఎల్‌అండ్‌టీ నిర్మాణ సంస్థ ప్రతినిధులు అప్రమత్తమై పనులు ప్రారంభించారు. పెచ్చులు ఊడిపడకుండా మరమ్మతు పనులు చేపట్టినట్లు హెచ్‌ఎంఆర్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి చెప్పారు.

హైదరాబాద్: మెట్రె స్టేషన్ల పనుల నాణ్యత, మన్నిక, లోపాలను గుర్తించేందుకు ఎల్‌అండ్‌టీ సంస్థ ఆరు ప్రత్యేక ఇంజినీరింగ్‌ బృందాలను ఏర్పాటు చేసింది. నాగోల్‌–హైటెక్‌సిటీ, ఎల్బీనగర్‌–మియాపూర్‌ రూట్లలోని అన్ని స్టేషన్ల విడిభాగాలు, ఇతర నిర్మాణాలను ఈ బృందాలు సూక్ష్మంగా పరిశీలిస్తున్నాయని హెచ్ఎంఆర్‌ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. మెట్రోకి సంబంధించి ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా నిర్మాణాల్ని పర్యవేక్షిస్తున్నట్టు ఆయన తెలిపారు. ముఖ్యంగా ఎక్కడా కూడా  పెచ్చులు ఊడిపోకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

, మెట్రో స్టేషన్లకు రిపేర్లు-తొలివెలుగు వార్తలకు స్పందన

ఇటీవల నగరంలోని అమీర్‌పేట మెట్రో రైల్వే స్టేషన్‌లో పెచ్చులూడి మీద పడటంతో ఓ వివాహిత ప్రాణాలు కోల్పోయింది. ఈ క్రమంలో మెట్రో నిర్మాణ లోపాలపై నలువైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. అసలు మెట్రో స్టేషన్ల నిర్మాణం పూర్తి స్థాయిలో జరిగిందా? ఇలానే జనం ప్రాణాలు తీస్తారా ? సోషల్ మీడియా వేదికగా సిటిజెన్లు ఆగ్రహం వెలిబుచ్చారు. ఈ సమస్యని తొలివెలుగు మొదట వెలుగులోకి తీసుకొచ్చింది. వరుస కథనాలు అందించింది. దాంతో భద్రతాపరమైన అంశాలను కమిషన్ ఆఫ్ మెట్రో రైలు సేఫ్టీ (సీఎంఆర్ఎస్) ప్రత్యక్షంగా పరిశీలించింది. మిగిలిన అన్ని స్టేషన్లపై సమీక్ష నిర్వహించింది. మెట్రో స్టేషన్లలో నిర్మాణ పరమైన లోపాల సవరణపై ఎల్అండ్‌టీ మెట్రో దృష్టి సారించింది. ఇప్పటి వరకు 10 మెట్రో స్టేషన్లలో లోపాలను గుర్తించి వాటిని సరిచేసింది. ఆయా మెట్రో స్టేషన్లలో మరమ్మతులు చేస్తున్నారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా అర్ధరాత్రి తర్వాత ఫ్లడ్ లైట్ల వెలుతురులో బూమ్‌ లిఫ్ట్ ఉపయోగించి మరమ్మతులు చేస్తున్నారు.

, మెట్రో స్టేషన్లకు రిపేర్లు-తొలివెలుగు వార్తలకు స్పందన

ఇప్పటి వరకు లోపాలు గుర్తించిన 10 స్టేషన్లలో పూర్తిగా మరమ్మతులు చేసినట్టు ఎన్‌వీఎస్ రెడ్డి చెప్పారు. ఉస్మానియా మెడికల్ కాలేజీ స్టేషన్ గ్రిడ్ ‘ఏ’ కుడివైపు బయటి భాగంలో లూజ్ ప్లాస్టర్ సామాగ్రిని గుర్తించి తొలగించారు. తార్నాక, మూసాపేట స్టేషన్లలో లోపాలను గుర్తించి సవరించారు. ఎల్బీనగర్ స్టేషన్ మెట్ల మార్గంపైన పగుళ్లు ఏర్పడ్డాయి. వీటిపై సిమెంట్ పూత వేశారు. న్యూమార్కెట్ స్టేషన్ ‘బీ’వైపు కాన్‌కోర్స్ అంతస్తులో లూజ్ మెటీరియల్స్ గుర్తించి తొలగించారు. గ్రిడ్ ‘ఏ’ కుడివైపు వేలాడుతున్న ఫైవుడ్‌ను తొలగించారు. బాలానగర్ మెట్రో స్టేషన్ ‘బీ’ వైపు గోడ ప్లాస్టర్ పగుళ్లు రావడంతో వాటిని పూడ్చారు. రసూల్‌పురా స్టేషన్ ‘సీ’  వైపు గోడ ఇటుకలు వేలాడుతుండటంతో వాటిని తొలగించి సరిచేశారు. పరేడ్ గ్రౌండ్ స్టేషన్ ‘ఏ’ వైపు రెయిలింగ్ గోడ దగ్గర కాంగ్రీటు లేచి ప్రమాదకరంగా మారడంతో పూడ్చివేశారు. హైటెక్ సిటీ స్టేషన్ లెడ్జ్ స్లాబ్ చివర్లో ప్యాచ్ వదులు కావడంతో వాటిని తొలగించి పూతవేశారు. గాంధీభవన్ స్టేషన్ గ్రిడ్ ‘కె’ మెట్ల ప్రాంతంలో లూజ్ కాంగ్రీటును గుర్తించారు. సరిచేశారు. మెట్రో స్టేషన్ల లోపాలపై ఇకపై ఎప్పటికప్పుడు సమీక్ష చేసి లోపాలు వుంటే సరిచేస్తామని మెట్రో అధికారులు చెబుతున్నారు.

Share on facebook
Share on twitter
Share on whatsapp