దేశంలో మెట్రో రైళ్ల రూపకల్పనలో కీలక పాత్ర పోషించి.. మెట్రోమ్యాన్‌గా పేరు సంపాదించిన ప్రముఖ ఇంజనీర్ శ్రీధరన్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. త్వరలోనే ఆయన బీజేపీలో చేరబోతున్నట్టు కేరళ పార్టీ విభాగం తెలిపింది. త్వరలోనే ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. శ్రీధరన్ బీజేపీలో చేరడం ఆసక్తికరంగా మారింది. వచ్చే ఆదివారం ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్టు తెలిసింది.
దేశంలోని ప్రముఖ నగరాల్లో మెట్రో రైలు నిర్మాణం వెనుక శ్రీధరన్ ప్రణాళికలే ఉన్నాయి. 2011లో ఢిల్లీ మెట్రో నుంచి ఆయన రిటైర్ అయ్యారు. అయితే పదవీ విరమణ అనంతరం సుదీర్ఘం కాలం తర్వాత ఆయన.. రాజకీయాల్లో రావడానికి నిర్ణయించుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. శ్రీధరన్ వయస్సు ప్రస్తుతం 88ఏళ్లు. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేసే విషయంపై స్పష్టత లేదు. అయితే ఎన్నికల్లో పోటీ చేస్తారా అని మీడియా ప్రశ్నకు. పార్టీ కోరితే అందుకే సిద్ధమేనని ఆయన స్పష్టం చేశారు.