ఉపాధి హామీ డబ్బుల్ని కేంద్రం పంపుతున్నా సీఎం కేసీఆర్ వాటిని పక్కదారి పట్టిస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ప్రజాసంగ్రామ యాత్రలో ఈ విషయాన్నే హైలెట్ చేస్తూ బండి సంజయ్ విమర్శలు గుప్పిస్తున్నారు. డబ్బులు అందక కూలీలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఉపాధి హామీ కూలీలు రోడ్డెక్కారు.
వికారాబాద్ జిల్లా దోమ మండలం బొంపల్లి గ్రామంలో ఆందోళనకు దిగారు కూలీలు. గత రెండు నెలలుగా తాము పని చేసినా డబ్బులు ఇవ్వలేదని ధర్నా చేపట్టారు. కొందరికి మాత్రమే డబ్బులు వస్తున్నాయని చాలామందికి రావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
పిడీ వచ్చి తమ సమస్యను పరిష్కరించాలంటూ రోడ్డుపై పనిముట్లు, కట్టె మొద్దులు అడ్డంగా వేసి బైఠాయించారు ఉపాధి హామీ కూలీలు. తమ డబ్బులు ఇచ్చేంతవరకు రోడ్డుపై నుంచి లేచేది లేదని ఆందోళన చేపట్టారు. పరిగి, మహబూబ్ నగర్ ప్రధాన రహదారి కావడంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి.
పోలీసులు జోక్యం చేసుకొని రోడ్డుపై బైఠాయించిన కూలీలకు నచ్చచెప్పి ధర్నా విరమింపచేశారు. రోడ్డుపై అడ్డంగా పెట్టిన కట్టె మొద్దులను తీయించారు. దీంతో నిలిచిపోయిన వాహనాలు ముందుకు కదిలాయి.