తాజాగా మరో వ్యక్తిని కేంద్ర హోం శాఖ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్‌కు చెందిన అర్ష్‌దీప్ సింగ్ గిల్ అలియాస్ అర్ష్ దల్లాను ఉగ్రవాదుల జాబితాలో కేంద్రం చేర్చింది. యూఏపీఏ చట్టం కింద అతన్ని ఉగ్రవాదిగా ప్రకటిస్తున్న కేంద్రం ఓ ప్రకటనలో వెల్లడించింది.
ఐఎస్‌ఐ ఇచ్చే ఆదేశాల ప్రకారం అర్ష్‌దీప్ దల్లా ఉగ్రసంస్థను నడుపుతున్నట్టు పేర్కొంది. కేటీఎఫ్ కెనడాకు చెందిన చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జర్‌కు అర్ష్ దల్లా అత్యంత సన్నిహితుడని చెప్పింది. పంజాబ్‌తో పాటు పలు దేశాల్లో పలు నేరాలకు పాల్పడ్డట్టు ప్రకటనలో తెలిపింది.
గతంలో పలు కేసులో అర్ష్ దల్లా పట్టుపడ్డాడు. ఏకే-47, ఐఈడీ, ఇతర ఆయుధాలు, మందుగుండు సామగ్రి సరఫరాకు సంబంధించిన పలు కేసుల్లోనూ దల్లాకు ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దల్లాను త్వరలోనే భారత్‌కు రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.
గతేడాది మేలో దల్లాపై రెడ్‌కార్నర్ నోటీసులను జారీ చేశారు. ఇది ఇలా ఉంటే కశ్మీర్ నేతలతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ రోజు భేటీ కానున్నట్టు తెలుస్తోంది. రాత్రి 9 గంటలకు ఈ భేటీ వుంటుందని సమాచారం. ఈ భేటీలో శాంతి భద్రతల సమస్యతో పాటు రాజకీయ అంశాలపై చర్చిస్తారని తెలుస్తోంది.