ప్రధాని నరేంద్ర మోడీతో మైక్రోసాఫ్ట్ చైర్మన్, సీఈఓ సత్య నాదెళ్ల భేటీ అయ్యారు. సాంకేతికత, ఆర్థిక వృద్ధితో పాటు సాధికారత తదితర అంశాలపై ఇరువురు చర్చించినట్టు తెలుస్తోంది. వీరి భేటీ గురించి సత్యనాదెళ్ల ట్వీట్ చేశారు. ప్రధాని మోడీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
వారిద్దరి మధ్య ప్రధానంగా డిజిటల్ ఇండియా, సాంకేతికతతో కూడిన సమగ్రాభివృద్ధిపై చర్చ జరిగినట్టు సమాచారం. డిజిటల్ పరివర్తన ద్వారా సుస్థిరమైన, సమ్మిళిత ఆర్థిక వృద్ధిపై మోడీ సర్కార్ లోతైన దృష్టితో ముందుకు వెళుతుండటం చాలా స్ఫూర్తిదాయకంగా ఉందని సత్యనాదెళ్ల కొనియాడారు.
డిజిటల్ ఇండియా విజన్‌ను గ్రహించి తద్వారా ప్రపంచానికి మార్గదర్శిగా భారత్ నిలిచేందుకు సహాయం చేసేందుకు తాము ఎదురు చూస్తున్నామని ఆయన పేర్కొన్నారు. భారత్‌కు తాము అన్నివిధాలా సహాయం చేసేందుకు రెడీగా ఉన్నామని పేర్కొన్నారు. డిజిటల్ అభివృద్ధి విషయంలో భారత్‌కు అన్ని విధాలా తోడ్పాటునందించేందుకు తమ కంపెనీ కట్టుబడి ఉందని ఆయన వివరించారు.
ఢిల్లీలో ఏర్పాటు చేసిన ‘టెక్ ఫర్ గుడ్ అండ్ ఎడ్యుకేషన్’ప్రదర్శనలో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. మరోసారి సాంకేతిక రంగం వృద్ధిని సాధించాలంటే మరో రెండేళ్ల పాటు అలుపెరగని పోరాటం చేసేందుకు రెడీ కావాలని ఆయన సూచించారు. కొవిడ్-19 మహమ్మారి ద్వారా డిమాండ్ తగ్గడంతో టెక్ పరిశ్రమ తిరోగమనం ఎదుర్కొంటోందన్నారు. ఇది ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఆర్థిక మాంద్యంతో కలిసి సాధారణీకరణకు దారితీసిందని వెల్లడించారు .
రెండేండ్లలో టెక్ రంగంలో పెను మార్పులు చోటు చేసుకుంటాయని ఆయన తెలిపారు. భారత్‌లోని కంపెనీలు కూడా నేడు క్లౌడ్ సాంకేతికతను అధికంగా వినియోగించుకుంటున్నాయని వివరించారు. టెక్నాలజీ రంగంలో క్లౌడ్ టెక్నాలజీ పెను మార్పును తీసుకు వస్తుందననారు. క్లౌడ్ వల్ల 70-80 శాతం మేర ఇంధన భారం తగ్గుతుందన్నారు. క్లౌడ్ కు చివరి నమూనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవుతుందని భావిస్తున్నట్టు చెప్పారు.