హైదరాబాద్: విశ్రాంత సీనియర్ ఐఏఎస్, పేదల పక్షపాతి బి.ఎన్. యుగంధర్ (80) ఇకలేరు. ఆయన మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల తండ్రి. పాలనలో తనదైన ప్రత్యేక ముద్ర ఉంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న యుగంధర్ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. 1962 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన యుగంధర్ అనేక కీలక బాధ్యతలు నిర్వహించారు. నిజాయతీ పరుడిగా, పేద ప్రజల శ్రేయస్సు కోసమే అనునిత్యం పరితపించి పనిచేసిన అధికారిగా మంచి గుర్తింపు ఉంది.
మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలో యుగంధర్ (2004-2009) ప్రణాళికా సంఘం సభ్యులు. ప్రధాని కార్యదర్శిగా, ముస్సోరిలోని లాల్‌బహుదూర్ శాస్త్రి ఐఏఎస్ అకాడమీకి డైరెక్టర్‌గా సేవలందించారు. సమర్థమైన, అత్యుత్తమ ప్రజా సేవకుడైన ఐఏఎస్ అధికారిగా యుగంధర్‌కు మంచి పేరుంది. పీవీ నర్సింహారావు ప్రభుత్వంలో పనిచేసిన యుగంధర్ గ్రామీణాభివృద్ధి శాఖలో కీలక సంస్కరణలు తీసుకొచ్చారు. ఆ సమయంలో వాటర్‌షెడ్‌ల అభివృద్ధికి రాష్ట్రాలతో సంబంధం లేకుండా కేంద్రం నుంచే నేరుగా జిల్లాలకే నిధులు వచ్చేలా మార్గదర్శకాలు రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు.
నిరాడంబర జీవితం గడుపుతూ ప్రతి నిత్యం పేద ప్రజల సంక్షేమం కోసం పరితపించిన సీనియర్ ఐఏఎస్ అధికారులు బీఎన్ యుగంధర్, కేఆర్ వేణుగోపాల్ మంచి స్నేహితులు. ఇద్దరు మిత్రులంటే పీవీకి ప్రత్యేకమైన అభిమానం ఉండేది. అందుకే ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో యుగంధర్‌కు గ్రామీణాభివృద్ధిశాఖ, కేఆర్ వేణుగోపాల్‌కు సంక్షేమ శాఖ బాధ్యతలు అప్పగించగా ఇద్దరూ అనేక కీలక సంస్కరణలు తీసుకొచ్చారు.
యుగంధర్ తనయుడు సత్య నాదెళ్లకు కేఆర్ వేణుగోపాల్ కుమార్తె అనుపమను ఇచ్చి వివాహం చేయడంతో మిత్రులిద్దరూ వియ్యంకులయ్యారు. పీవీ నర్సింహారావుతో ఇద్దరికీ ఎంతో మంచి సాన్నిహిత్యం ఉన్నప్పటికీ సత్య నాదెళ్ల, అనుపమ వివాహానికి ఆయన్ను పిలవలేదట. ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా ఎంతో సాదాసీదాగా సత్య నాదెళ్ల వివాహం చేశారు. దీంతో విషయం తెలుసుకున్న పీవీ నర్సింహారావు ఎలాంటి ఆడంబరం లేకుండా ఒంటరిగానే ఆ వివాహానికి హాజరయ్యారట.
బీఎన్ యుగంధర్ తన జన్మభూమి అభివృద్ధికి పాటు పడ్డారు. అనంతపురం జిల్లా యల్లనూరు మండలంలోని బుక్కాపురాన్ని ప్రగతిబాట పట్టించాలని ఎంతో తపన పడ్డారు. తన వంతుగా గ్రామంలోని దేవాలయ అభివృద్ధికి, సిమెంట్ రోడ్ల నిర్మాణానికి కృషిచేశారు.