టిక్ టాక్ ను కొనుగోలు చేస్తున్నామని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. టిక్ టాక్ కొనుగోలు పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభ్యంతరం వ్యక్తం చేశారనే వార్తల నేపథ్యంలో ఒక వివరణాత్మక ప్రకటనను కూడా విడుదల చేసింది. సెప్టెంబర్ 15వ తేదీ వరకు టిక్ టాక్ కు సంబంధించి కొనుగోలు చర్చలను పూర్తిచేస్తామని తెలిపింది. అయితే ట్రంప్ అభ్యంతరాలను తాము అర్థం చేసుకున్నామని టిక్ టాక్ ద్వారా సమాచార భద్రతకు ఎలాంటి ముప్పు రాకుండా చూసుకుంటామని ప్రకటించింది. అమెరికా దేశ పౌరుల సమాచారం ఎట్టి పరిస్థితుల్లో ఇతర దేశాలకు వెళ్లకుండా చూసుకుంటామని హామీ ఇచ్చింది. అమెరికాకు ఆర్థికలాభం కలిగేలా చూస్తామని తెలిపింది. పొరపాటున ఇతర దేశాల్లోని సర్వర్లలోకి అమెరికా పౌరుల సమాచారం వెళ్లి ఉంటే ఆ సర్వర్లను శాశ్వతంగా తొలగించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.