మైక్రోసాఫ్ట్‌లో అత్యాచార పర్వం!

పేరు గొప్ప.. ఊరు దిబ్బ అంటే ఇదే మరి. సాఫ్ట్‌వేర్‌ గ్లోబల్ జెయింట్ కంపెనీ ‘మైక్రోసాఫ్ట్‌’.. విచిత్రమైన వివాదంలో చిక్కుకుంది. ఈ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ అనునుకున్నంత ‘సాఫ్ట్’ కాదని, అంతర్గతంగా అక్కడొక అత్యాచార పర్వమే జరుగుతోందని తాజా వార్తలు చెబుతున్నాయి. అక్కడున్న మహిళా ఉద్యోగుల గోడు ఇంతకుముందే వెల్లడైనప్పటికీ.. ఇప్పుడది పక్కా ఆఫీషియల్. 2010 నుంచి 2016 వరకు లింగ వివక్ష, లైంగిక వేధింపుల కింద 238 ఫిర్యాదులు నమోదైనట్లు తెలిసింది. ఈ మేరకు సోమవారం కోర్ట్ ఫైలింగ్స్ ద్వారా బహిరంగ ప్రకటన వెల్లడైంది.

ఆడవాళ్ళకు జీతంలో ఇంక్రిమెంట్, పోస్టింగ్స్ లో ప్రమోషన్స్ నిరాకరిస్తూ మైక్రోసాఫ్ట్ కంపెనీలో కుట్ర పూరితంగా లింగవివక్ష అమలవుతోందని ఎప్పట్నుంచో అభియోగాలున్నాయి. అయితే.. అటువంటి పాలసీ ఏదీ తమ దృష్టికి రాలేదంటూ మైక్రోసాఫ్ట్ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తోంది. కానీ.. ఇప్పుడా ఇంటర్నల్ గబ్బు మొత్తం బహిర్గతం కావడంతో కంపెనీ ప్రతిష్టకు భంగం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తం 8 వేల మంది మహిళల్ని సంప్రదించి.. వాళ్లపై జరిగిన లైంగిక వేధింపులకు సంబంధించిన వివరాలు సేకరించి.. లాసూట్ ఫైల్ చేసే పనిలో నిమగ్నమయ్యారు అడ్వొకేట్లు. హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్ మెంట్ లో నమోదైన ఫిర్యాదుల్ని ఉద్దేశపూర్వకంగానే బహిర్గతం చేయలేదని మైక్రోసాఫ్ట్ అంగీకరించింది. యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జ్ జేమ్స్ రాబర్ట్ మాత్రం తీసుకోబోతున్న చర్యలపై ఎటువంటి ప్రకటన చేయలేదు.