ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆలయ పురవీధుల్లో కన్నడ భక్తులు వీరంగం సృష్టించారు. స్థానిక ఒక సత్రం ముందు ఉన్న ఓ టీ దుకాణం వద్ద కన్నడ భక్తులు, స్థానికుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
మాటమాట పెరగడంతో ఒకరిపై ఒకరు దాడికి దిగారు. ఈ క్రమంలో కన్నడ భక్తులు తాత్కాలిక దుకాణాలు, కార్లు, ద్విచక్రవాహనాలపై దాడి చేశారు. అంతే కాకుండా టీ దుకాణానికి నిప్పు పెట్టారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికుడు.. కన్నడ యువకున్ని గొడ్డలితో నరికాడు. తీవ్రగాయాలై అతన్ని 108 వాహనంలో సున్ని పెంట ఆసుపత్రికి తరలించారు.
అర్ధరాత్రి కన్నడ యువకులు శ్రీశైలం వీదుల్లో వీరంగం సృష్టించారు. అయితే.. వారు చేస్తున్న దాడులతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటే భయంపడ్డామని స్థానికులు చెప్తున్నారు. కన్నడ భక్తుల దాడులను స్థానిక పోలీసులు నిలువరించలేకపోయారనే విమర్శలు వచ్చాయి.
సమాచారం అందుకున్న పోలీసులు.. అర్ధరాత్రి డీఎస్పీ శృతి శ్రీశైలం ఆధ్వర్యంలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళన కారులను చెదరగొట్టి పరిస్థితులను సద్దుమణిగేలా చేశారు. కాగా.. ఉగాది ఉత్సవాల సందర్భంగా ఈ ఘటన జరగడంపై విమర్శలు వస్తున్నాయి.