భారత వైమానిక దళానికి చెందిన మిగ్-29 ‘కె’ ఫైటర్ జెట్ గోవా తీరంలో కుప్పకూలిపోయింది. వైమానిక స్థావరానికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఫైటర్ జెట్ పైలట్ సురక్షితంగా బయటపడ్డారు.
విమాన పరిస్థితి ముందే అంచనా వేసిన పైలట్ వెంటనే అలర్ట్ అయి విమానం నుంచి సముద్రంలోకి దూకేశాడు. దీంతో ప్రాణాలతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. పైలట్ కోసం నేవీ అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.
చివరకు అధికారులు పైలట్ ను రెస్క్యూ చేయగలిగారు. ప్రస్తుతం పైలట్ పరిస్థితి నిలకడగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఫైటర్ జెట్ లో సాంకేతిక లోపాలు తలెత్తడంతోనే ప్రమాదం జరిగి వుంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
మిగ్ -29కే ఫైటర్ జెట్ కూలిపోవడానికి గల కారణాలపై దర్యాప్తు చేయాలని బోర్డు ఆఫ్ ఎంక్వైరీకి ఎయిర్ ఫోర్స్ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.