ఇండియన్ నేవీ మరో ఘనతను సాధించింది. మిగ్-29 కే యుద్దం విమానం స్వదేశీ యుద్ద నౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌పై విజయవంతంగా నైట్ ల్యాండింగ్ చేసింది. ఇది చారిత్రాత్మక మైలు రాయి అని భారత నేవి ప్రకటించింది. రక్షణ రంగంలో స్వావలంబన లేదా ఆత్మ నిర్బర దిశగా నౌకాదళం ప్రోత్సాహాన్ని ఈ విజయం సూచిస్తోందని పేర్కొంది.
ఈ సవాలుతో కూడిన నైట్ ల్యాండింగ్ ట్రయల్ ను విక్రాంత్ సిబ్బంది, నావికా పైలట్ల సంకల్పం, అత్యంత నైపుణ్యంతో పూర్తి చేశారని చెప్పింది. ఈ విషయంలో వారిని అభినందించాల్సిందేనని తెలిపింది. నైట్ ల్యాండింగ్ విజయవంతం కావడంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ హర్షం వ్యక్తం చేశారు.
మరో మైలురాయిని సాధించినందుకు భారత నావికాదళాన్ని అభినందిస్తూ రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. ఐఎన్ఎస్ విక్రాంత్ లో మిగ్-29కే తొలి నైట్ ల్యాండింగ్ ట్రయల్స్‌ను విజయవంతంగా చేపట్టినందుకు భారత నౌకాదళానికి అభినందనలు తెలిపారు. ఈ అద్భుతమైన విజయం విక్రాంత్ సిబ్బంది, నావికా పైలట్ల నైపుణ్యాలు, పట్టుదల, వృత్తి నైపుణ్యానికి నిదర్శనమన్నారు.
అంతకు ముందు మార్చి 28న ఐఎన్ఎస్ విక్రాంత్‌పై కమోవ్ 31 హెలికాప్టర్ కూడా విజయవంతంగా ల్యాండ్ అయింది.
ఐఎన్ఎస్ విక్రాంత్‌ను కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో నిర్మించారు. ఇది 262 మీటర్ల పొడవు, 62 మీటర్ల వెడల్పు, 62 మీటర్లు. 59 మీటర్ల వరకు ఎత్తు ఉంటుంది. ఇది భారతదేశ తొలి స్వదేశీ నిర్మిత విమాన వాహక నౌక. ఈ యుద్ధనౌకను ‘కదిలే నగరం’గా ‘బాహుబలి నౌక’గా పేర్కొంటారు.