పొట్ట కూటికోసం సొంత ఊరిని వదిలి వందల కిలోమీటర్ల దూరం వచ్చిన వలస కార్మికుల జీవితాల్లోకి కరోనా వైరస్ సునామీలా వచ్చింది. కరోనా కట్టడిలో భాగంగా దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించటంతో ఉపాధి కరవై.. ఆర్థిక ఇబ్బందులు తలుపు తట్టాయి. సొంతూరికి వెళ్లేందుకు అవకాశం లేదు. ఇక చేసేది ఏం లేక వలస కార్మికుడు, వికాస్ చౌహాన్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే కొన్ని నెలల కిందట ఉత్తర్‌ప్రదేశ్‌లోని ధన్‌గంజ్ నివాసి వికాస్ చౌహాన్, పలువురు తో కలిసి అసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ ఎస్పీఎంలో కెమికల్ డిపార్టుమెంట్‌లో గుత్తేదారు ఆధ్వర్యంలో పనుల నిమిత్తం తరలివచ్చారు.
యాజమాన్యం వారికి ఉండటానికి క్వార్టర్స్ కేటాయించగా, ఆ క్వార్టర్స్ లోనే నివాసముంటున్నారు. లాక్‌డౌన్‌తో ఎస్పీఎంలో పనులు నిలిచిపోయాయి… సొంతూళ్లకు వెళ్లేందుకు అవకాశం లేక తీవ్ర మనస్తాపానికి గురైన చౌహాన్ తాను నివాసముంటున్న ఎస్పీఎం క్వార్టర్స్ లోని ఓ గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీస్ లు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు..