గోవా బీచ్‌లో నగ్నంగా పరుగెత్తి మోడల్, నటుడు మిలింద్ సోమన్ ఇటీవల వార్తల్లో నిలిచిన విషయం విదితమే. అయితే తాజాగా అతను సోషల్ మీడియాలో మరో పోస్ట్ పెట్టాడు. గతంలో తాను పర్యావరణ పరిరక్షణకై ఓ మీడియా సంస్థ నిర్వహించిన క్యాంపెయిన్ లో భాగంగా ఢిల్లీ నుంచి ముంబైకి 30 రోజుల్లో పరుగెత్తుతూ వచ్చానని చెబుతూ మిలింద్ ఓ పోస్ట్‌ను పెట్టాడు. ఈ క్రమంలో ఆ పోస్ట్ సోషల్ మీడియాలో మరోమారు వైరల్ అవుతోంది.
2012లో మీడియా సంస్థ ఎన్‌డీటీవీ గ్రీనథాన్ అనే కార్యక్రమం నిర్వహించింది. అందులో భాగంగా ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు గాను మిలింద్ సోమన్ ఏకంగా 1500 కిలోమీటర్లు పరుగెత్తాడు. ఢిల్లీ నుంచి ముంబైకి పరుగెత్తుతూ 30 రోజుల్లో గమ్యస్థానానికి చేరుకున్నాడు. అందుకుగాను అతను 5 రాష్ట్రాలను కవర్ చేస్తూ వచ్చాడు. కాగా అప్పట్లో అతను అలా ఆ కార్యక్రమంలో పాల్గొన్న ఫోటోలను తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
మే 2012 – ఢిల్లీ నుంచి 5 రాష్ట్రాలను కవర్ చేస్తూ ముంబైకి 1500 కిలోమీటర్ల దూరం పరుగెత్తి 30 రోజుల్లో చేరుకున్నా. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు చేపట్టిన కార్యక్రమం అది. మనం పర్యావరణ పరిరక్షణపై ఒకసారి, రెండు సార్లు లేదా 100 సార్లు మాట్లాడినా ప్రయోజనం ఉండదు. మన ఆరోగ్యం కోసం మనం పర్యావరణాన్ని పరిరక్షించాలి. ప్రతి రోజూ పర్యావరణం పట్ల పాజిటివ్‌గా స్పందించాలి. అలా చేయడం అత్యంత ఆవశ్యకం. ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండండి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. రీయూజ్, రెడ్యూస్, రీసైకిల్, రీఇన్వెంట్.. అని మిలింద్ సోమన్ పోస్టు పెట్టాడు.
కాగా మిలింద్ సోమన్ తన భార్య అంకిత కొన్వార్‌తో కలిసి మారథాన్‌లలో తరచూ పాల్గొంటుంటాడు. ప్రజలకు ఫిట్‌నెస్‌పై పాఠాలు చెబుతూ అవగాహన కల్పిస్తుంటాడు. ఇక అతను చివరి సారిగా అమెజాన్ ప్రైమ్ సిరీస్ ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్‌లో నటించాడు.