వందలు కాదు.. వేలు కాదు.. లక్షలాది చేపలు మృత్యువాత పడ్డాయి. కిలో మీటర్ల మేర నదిలో ఎక్కడ చూసినా నిర్జీవంగా ఉన్న చేపల దృశ్యాలే కనిపించాయి. ఈ దారుణ పరిస్థితి ఆస్ట్రేలియా మెనిండీలో ఉన్న డార్లింగ్ నదిలో నెలకొంది. ప్రస్తుతం చనిపోయిన చేపలను తొలగించి నదిని శుభ్రం చేసే పనిలో అక్కడి ప్రభుత్వం నిమగ్నమైంది. చేపలను తొలగించేందుకు ప్రత్యేక నైపుణ్యాలను కలిగిన సిబ్బందిని నియమించినట్లు పోలీసులు తెలిపారు.
నెట్టింగ్ విధానం ద్వారా చనిపోయిన చేపలను బయటకు తీస్తున్నట్లు వెల్లడించారు. చనిపోయిన చేపలను తొలగించి నదిని శుభ్రం చేస్తోంది అక్కడి ప్రభుత్వం. అన్ని ప్రాంతాల్లో చేపలను తొలగించండం సాధ్యమయ్యే పని కాదన్నారు. సహాయక చర్యలు, నీటి నాణ్యతను పర్యవేక్షించడానికి మెనిండీలో అత్యవసర కేంద్రాల్ని ఏర్పాటు చేశామని వెల్లడించారు.
ఈ వారంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ కు చేరుకున్నాయన్నారు. లక్షలాది చేపలు మృత్యువాత పడడం వల్ల డార్లింగ్ నదిని అధికారులు పరిశీలించారు. వదర నీరు తగ్గుముఖం పట్టడం, వేడి వాతావరణం కారణంగా నీటిలో ఆక్సిజన్ శాతం పడిపోవడమే కారణంగానే భారీ స్థాయిలో చేపలు చనిపోవడానికి కారణమని తెలిపారు.
కాగా ఓజ్ ఫిష్ అనే స్వచ్ఛంద సంస్థ నదిలోని చేపలను రక్షించే పనిలో పడింది. తమ వాలంటీర్లతో సహాయక చర్యలు ప్రారంభించింది. తమ బృందం రక్షించిన చేపలను ప్రత్యేక ట్యాంకుల్లో భద్రపరుస్తున్నట్లు ఆ సంస్థ చెబుతోంది.