ఎంఐఎం అధినేత అసదుద్దీన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో నిర్మిస్తున్న మసీదుకు ఎవరూ విరాళాలు ఇవ్వకూడదని పిలుపునిచ్చారు. ఆ మసీదు నమాజ్ చేయడం హరామ్( ఇస్లాంకు వ్యతిరేకం) అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం బీదర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వ్యాఖ్యలు చేశారు. ముస్లిం మత పెద్దలతో మాట్లాడిన తర్వాతే.. తాను ఈ విషయం చెబుతున్నట్టు వివరించారు. అయోధ్యలో కడుతున్న ఆ నిర్మాణం మసీదు కాదని, అక్కడ ప్రార్థనలు చేయకూడదని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డుకు చెందిన ఉలేమాలే చెబుతున్నారంటూ ప్రస్తావించారు.
మరోవైపు అసద్ వ్యాఖ్యలను… అయోధ్య మసీదు ట్రస్ట్ సెక్రటరీ అథర్ హుస్సేన్ తీవ్రంగా ఖండించారు. ఆయన మాటలు రాజకీయ ఎజెండాలో భాగమని విమర్శించారు. ఇస్లాంకు వ్యతిరేకమైన చిన్న ప్రదేశం కూడా ఈ ప్రపంచంలో లేదని అన్నారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్‌కు చరిత్ర తెలియని. మొదటి స్వాతంత్ర్య యుద్ధం పోరాటంలో పడిన బాధలను వారి కుటుంబం అనుభవించలేదని అథర్ హుస్సేన్ విమర్శించారు.
కాగా, రిపబ్లిక్ డే రోజు అయోధ్యలో మసీదు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. బాబ్రీ మసీదు కంటే పెద్దగా దీన్ని నిర్మిస్తున్నారు.