తెలంగాణ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు హాట్ హాట్ గా సాగుతున్నాయి. అసెంబ్లీలో బీఆర్ఎస్, ఎంఐఎం నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో తొలిరోజున ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై చేసిన ప్రసంగంపై ఎంఐఎం నేత అక్బరుద్ధీన్ ఓవైసీ అభ్యంతరం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగంలో అన్ని అంశాలు ప్రస్తావించలేదని, ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం ఆ అంశాలు పేర్కొనలేదా? లేక గవర్నర్ తొలగించారా? అని ప్రశ్నించారు.
అసెంబ్లీలో హామీలు ఇస్తారు.. కానీ అవి బయట మాత్రం అమలు చేయరని ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. పాతబస్తీలో మెట్రో సంగతి, హైదరాబాద్ లో ఉస్మానియా ఆస్పత్రి పరిస్థితి ఏంటని? ప్రభుత్వాన్ని నిలదీశారు. ఉర్ధూ రెండవ అధికారిక భాష అయినా.. అన్యాయం జరుగుతోందని అన్నారు. బీఆర్ఎస్.. బీజేపీకి మద్దతు ఇచ్చిందని.. కానీ బీజేపీ రాష్ట్రానికి ఏమిచ్చిందని ప్రశ్నించారు. నోట్లరద్దు, జీఎస్టీకి మద్దతు ఇవ్వొద్దన్నామని.. బీజేపీ మొదటి నుండి తెలంగాణకు అన్యాయమే చేస్తోందన్నారు.
ఎమ్మెల్యే అక్బరుద్ధీన్ వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. గొంతు చించుకున్నంత మాత్రాన ఉపయోగం ఉండదన్నారు. ఏడుగురు సభ్యులు ఉన్న పార్టీకి ఎక్కువ సమయం ఇవ్వడం సరికాదన్నారు. బీఏసీ సమావేశానికి రాకుండా అక్బరుద్ధీన్ మాట్లాడటమేంటి అన్నారు. ఇలా ఎంఐఎంకు, బీఆర్ఎస్ కు మధ్య అసెంబ్లీలో మాటల యుద్ధం సాగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
కేటీఆర్ కామెంట్స్ కు అక్బరుద్దీన్ సమాధానంగా.. తానేమీ కొత్త సభ్యున్ని కాదని, మీకు సహనం తక్కువవుతోందని విమర్శాత్మక కామెంట్స్ చేశారు. పొగిడితే మాత్రం ఎంత సేపైనా ఏమీ అనరని వ్యాఖ్యానించారు. ఆ వెంటనే కల్పించుకున్న మంత్రి ప్రశాంత్ రెడ్డి.. అక్బర్ గవర్నర్ ప్రసంగంపై మాట్లాడితే బాగుంటుందని సూచించారు. అక్బర్ కే సహనం తగ్గి, కోపం వస్తోందని కామెంట్స్ చేశారు.