గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు మళ్లీ బెదిరింపు కాల్స్, మెసేజెస్ వచ్చాయని అన్నారు. శుక్రవారం హైదరాబాద్ లో రాజాసింగ్ మీడియాతో మాట్లాడారు. తనను చంపుతామంటూ పాకిస్తాన్ నుంచి ఆగంతకులు ఫోన్ చేశారని చెప్పారు.
ఈ విషయమై రెండు రోజుల క్రితం డీజీపీకి ఫిర్యాదు చేసినట్టుగా గుర్తు చేశారు. కానీ, తన ఫిర్యాదుపై ఇంత వరకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఎవరిని అరెస్ట్ కూడా చేయలేదని మండిపడ్డారు. అసలు కమాండ్ కంట్రోల్ రూం ఎందుకు ఉందని ఆయన ప్రశ్నించారు.
బీజేపీ, కాంగ్రెస్ నేతల ఫోన్ లు టాపింగ్ చేయడానికి, బీజేపీతో బీఆర్ఎస్ నేతలు టచ్ లో ఉన్నారని తెలుసుకోవడానికేనా.. అని నిలదీశారు. మరోవైపు పాతబస్తీలో స్లీపర్ సెల్స్ ఉన్నాయని రాజాసింగ్ ఆరోపించారు. తనను బెదిరించిన ఆగంతకులు ఈ విషయాన్ని తనతో చెప్పారన్నారు.
టెర్రరిస్టులకు ఆర్థికంగా, ఫిజికల్ గా ఎంఐఎం సహకరిస్తుందని సంచలన ఆరోపణలు చేశారు. గతంలో హరేన్ పాండ్య హత్య కేసులో టెర్రరిస్టులను అరెస్ట్ చేసేందుకు వెళ్తే ఎంఐఎం నేతలు కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా చేశారని అన్నారు. ఈ నేపథ్యంలో టెర్రరిస్టులకు ఎంఐఎం అండ ఉందని పోలీసులు భయపడుతున్నారా.. అని ఆయన ప్రశ్నించారు. ఇక పోతే బీఆర్ఎస్ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని విమర్శించారు. అవసరమైతే దేశం కోసం మళ్లీ జైలుకు వెళ్లేందుకైనా సిద్ధం అని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. తనకు జైలే ఫాం హౌస్ లాంటిదని… తనపై వ్యక్తిగత కేసులు లేవని అన్నారు.