మంత్రి కేటీఆర్ అండదండలతో అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో అక్రమ మైనింగ్ రెచ్చిపోతోందన్నారు కాంగ్రెస్ నేత బక్క జడ్సన్. దీనిని బంద్ చేయాలని ఏఐసీసీ కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, రైతులతో కలిసి తెలంగాణ మైనింగ్ జాయింట్ డైరెక్టర్ కు ఆయన ఫిర్యాదు చేశారు.
మైనింగ్ కంపెనీలు బండ రావిరాల, చిన రావిరాల, తారామతిపేట, దేశముఖిలోని సర్వే నెంబంర్ 268లో 670 ఎకరాలలో అక్రమ మైనింగ్, క్రషింగ్ యూనిట్లు, రెడీమిస్ ఇతర ప్రైవేట్ పట్టా భూములను నిర్వహిస్తున్నట్లు తెలిపారు జడ్సన్. రాష్ట్రంలోని అబ్దుల్లాపూర్ మెట్, పోచంపల్లి మండలాల గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. విలువైన సహజ వనరులను రహస్యంగా వెలికితీస్తున్నారని ఆరోపించారు.
సదరు కంపెనీలు ఎలాంటి నియమాలు, నిబంధనలకు కట్టుబడి లేవని.. ఇష్టానుసారంగా పని చేస్తున్నాయని మండిపడ్డారు జడ్సన్. ప్రభుత్వం నుండి సంబంధిత అధికారులు మూగ ప్రేక్షకులుగా మారారని ఆరోపించారు. ఈ చట్ట విరుద్ధ కార్యకలాపాలను ప్రశ్నించే ధైర్యం చేసిన వ్యక్తులను బెదిరిస్తున్నారని తెలిపారు. ఈ మైనింగ్ మాఫియాకు చట్టాలంటే గౌరవం లేదన్నారు.
దీన్ని అట్టుకోకుంటే తెలంగాణ మైనింగ్ కార్యాలయం ముందు ఆమరణ దీక్ష చేస్తామని చెప్పారు జడ్సన్. కోదండరెడ్డితోపాటు సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, సామాజిక వేత్త ఇంద్రారెడ్డి, రైతు నాయకులు కృష్ణ యాదవ్, లింగారెడ్డి, మైసయ్య సహా పలువురు రైతులు జడ్సన్ వెంట ఉన్నారు.