కోనసీమ జిల్లా పేరు మార్చి.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమగా పేరు మారుస్తూ.. రెవెన్యూ శాఖ ప్రాథమిక ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఏపీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంతేకాకుండా విధ్వంస ఘటనలు చోటు చేసుకున్నాయి. ఊహించని విధంగా మంత్రి పినిపే విశ్వరూప్ ఇంటిపై ఆందోళనకారులు దాడికి దిగి ఇంటిని తగులబెట్టారు. అదే విధంగా ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇంటిపై దాడికి పాల్పడ్డారు.
అయితే.. ఈ ఆందోళలనపై పలువురు వైసీపీ నేతలు స్పందించారు. ఈ సందర్భంగా ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, జనసేన పార్టీలు కుమ్మక్కై దాడులకు దాడులకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. కొన్ని దుష్ట శక్తులు రాష్ట్రంలో ఉద్దేశపూర్వకంగా అల్లర్లు సృష్టించాలని చూస్తున్నాయంటూ విమర్శలు గుప్పించారు. ఒక జిల్లాకు రాజ్యాంగ నిర్మాత అయిన అంబేడ్కర్ పేరు పెట్టడం వల్ల ఈ ప్రభుత్వం ఆయనకు గొప్ప గౌరవాన్ని ఇచ్చిందనే కనీస జ్ఞానం లేకుండా వ్యవహరిస్తున్నారని విరుచుకుపడ్డారు.
ఒక కులానికో, ఒక వర్గానికో చెందిన వారు కాదని.. అంబేడ్కర్ అందరివాడనే విషయాన్ని గుర్తుంచుకోవాలని వ్యాఖ్యానించారు సురేష్. ఆయన పేరు పెట్టడంపై అనవసరపు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. అన్ని వర్గాల సూచన, కోరిక మేరకే అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చడం జరిగిందని మంత్రి వెల్లడించారు. తాజాగా కోనసీమ జిల్లాలో చోటు చేసుకున్న పరిస్థితులను చూస్తే పథకం ప్రకారమే అల్లర్లు సృష్టించాలన్న ఎత్తుగడలో భాగంగా కనిపిస్తోందంటూ మంత్రి పేర్కొన్నారు.
కోనసీమ జిల్లాలో 144 సెక్షన్ కొనసాగుతుందని.. అమలాపురంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. మంత్రి విశ్వరూప్, ఇతర ప్రజాప్రతినిధుల ఇళ్లపై అల్లరి మూకల దాడిని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఈ అల్లర్ల వెనుక ఎవరున్నారో వారిని బయటకు లాగుతామని హెచ్చరించారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం వల్ల ప్రతిపక్షాలకు వచ్చే లాభం ఏముందో అర్ధం కావడంలేదని విచారం వ్యక్తం చేశారు. వైసీపీని నేరుగా ఎదుర్కొనే దైర్యం లేకనే అల్లర్లకు ఆధ్యం పోస్తున్నారని విమర్శలు గుప్పించారు మంత్రి సురేష్.