ఏ ముహూర్తాన ప్రారంభం అయిందో గానీ, పోలవరం ప్రాజెక్టు పనులు సాగుతూనే ఉన్నాయి. ఏళ్లు గడుస్తున్నాయి.. ప్రభుత్వాలు మారుతున్నాయి గానీ.. ప్రాజెక్టు మాత్రం పూర్తి కావడం లేదు. చంద్రబాబుకు చేతకాలేదు.. తాము పూర్తి చేసి చూపిస్తామని చెప్పిన వైసీపీ సర్కార్ కూడా మాటలకే పరిమితం అయింది. ఇప్పుడప్పుడే ప్రాజెక్టు పూర్తయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. తాజాగా మంత్రి అంబటి రాంబాబు.. ప్రాజెక్టును సందర్శించి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆదివారం ఉదయం పనులను పరిశీలించారు మంత్రి. అధికారులతో భేటీ అయిన ఆయన.. పనుల పరోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ప్రభుత్వ తొందరపాటు చర్యల వల్లే ప్రాజెక్ట్ కి తీవ్ర నష్టం ఏర్పడిందని ఆరోపించారు. నిపుణుల బృందాలు ప్రాజెక్ట్ పనులను పూర్తి స్థాయిలో పరిశీలించాయని.. గతేడాది వచ్చిన వరదల కారణంగా డయాఫ్రమ్ వాల్ బాగా దెబ్బతిందని పేర్కొన్నారు.
భారీ నష్టం వాటిల్లిందని వెల్లడించారు రాంబాబు. దాదాపు 485 మీటర్ల మేర దెబ్బతిందని.. పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయన్నారు. దీని కోసం 2వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని తెలిపారు. కాఫర్ డ్యామ్ పూర్తి చేయకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మించడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. దీనికి పూర్తి బాధ్యత అప్పటి టీడీపీ ప్రభుత్వానిదేనని ఆరోపించారు.
ఇది ముమ్మాటికీ మానవ తప్పిదం వల్లే జరిగిందని.. అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునే ఆలోచన చేస్తామన్నారు మంత్రి. పనులు త్వరగా పూర్తి చేయాలనే కంగారు లేదని, అతి జాగ్రత్తగా పూర్తి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అయితే.. సీఎం జగన్ చేతుల మీదుగానే పోలవరం ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఈ సీజన్ లో ప్రాజెక్ట్ పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.