జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ మాట మాట్లాడినా దానికి ప్రతిగా వెంటనే అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కౌంటర్లు ఇస్తూనే ఉంటున్నారు. వారిలో ముఖ్యంగా అంబటి రాంబాబు ఒకరు. తాజాగా ఓ కార్యక్రమంలో పవన్ మా నాన్న నాస్తికుడు.. మా నాయనమ్మ దీపారాధన చేస్తే సిగరెట్ వెలిగించుకుని దేవుడు లేడు.. దెయ్యం లేదు అనే వాడు.. కానీ ఆ తర్వాత కాలంలో తానేదో తప్పు చేశానని ప్రతి రోజూ బాధపడేవారు.
అందుకే ఇది మన సంప్రదాయం అని గుర్తించాలి. మన సంప్రదాయాలను గౌరవించాలని వ్యాఖ్యానించారు పవన్. ఈ మాటలకు తనదైన శైలిలో కౌంటర్ వేశారు మంత్రి అంబటి రాంబాబు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన.. పవిత్రమైన దీపారాధనతో సిగరెట్టు ముట్టించుకునే వాడని స్వర్గంలో ఉన్న తండ్రినే అవమానపరిచే పుత్రుడు సమాజానికి అవసరమా? అని ట్వీట్ చేశారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా మాట్లాడిన పవన్ వైసీపీనే కాదు.. ఏ పార్టీ నేత అయినా మళ్లీ వేర్పాటు వాదం గురించి మాట్లాడితే నా అంత తీవ్రవాది ఉండడని పవన్ హెచ్చరించారు. ఎవడికి వాడు రాష్ట్రం కావాలంటూ స్టేట్మెంట్లు ఇస్తారా..? అంటూ నిలదీసిన ఆయన.. నాది బాధ కాదు.. ఆవేదన అన్నారు.
దేశ సమగ్రతకు భంగం కలిగించే పనులు చేస్తే జనసేన ఊరుకోదని వార్నింగ్ ఇచ్చిన ఆయన ఏపీ భవిష్యత్ బాగుంటుంది.. జనసేనకు అండగా నిలవండి.. రాజకీయ వ్యూహాలు నాకు వదిలేయండి.. ఏపీ భవిష్యత్తు గురించి వ్యూహాలు ఉంటాయి. కానీ నా గురించి వ్యూహాలు ఉండవని పవన్ వ్యాఖ్యానించిన విఫయం తెలిసిందే.