రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఒక వ్యక్తి కోసం, తన సామాజిక వర్గానికి చెందిన పార్టీ బాగుండాలనో ఈ నిర్ణయం తీసుకోవడం బాధాకరమన్నారు మంత్రి అనిల్ కుమార్. కరోనా పేరుతో ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని ఊహించలేదు. టీడీపీకి అభ్యర్థులు నిలబెట్టేందుకు దిక్కు కూడా లేదు. అందుకే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను అడ్డం పెట్టుకున్నట్టు ఉందని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ కు విచక్షణాధికారం ఉంది కాని విచక్షణ కోల్పోయి నిర్ణయం తీసుకునే అధికారం ఎక్కడిదని ప్రశ్నించారు. కరోనా వైరస్ కోసం ఎన్నికలు వాయిదా వేసే ముందు రాష్ట్రంలో అధికారులను ఎవరినైనా సంప్రదించారా అంటూ మండిపడ్డారు.
45 రోజులు ఎన్నికల కోడ్ ఉందని చంద్రబాబు కుట్ర పూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు మంత్రి అనిల్ కుమార్. ఎన్నికల కమిషనర్ కుమార్తె గతంలో ఈడీబీ లో పని చేశారు. దానికి ప్రతిఫలంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారా.. దీనిపైనా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దీనికోసం రాష్ట్ర అభివృద్ధిని ఫణంగా పెడుతున్నారన్ని ఆరోపించారు.
ఎన్నికలు ఆపేసిన తర్వాత అధికారులను బదిలీ చేసే అధికారం ఎలక్షన్ కమిషనర్ కు ఎక్కడ ఉందని ప్రశ్నించారు. ఫ్రాన్స్ లో 5500 కరోనా కేసులు, 127 మంది చనిపోతే కూడా అక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించారు. ఇక్కడ అంత దారుణమైన పరిస్థితి లేదు కదా. కరోనా కన్నా పెద్ద వైరస్ గా చంద్రబాబు తయారు అయ్యారు. ఎన్నికలు ఆపేయాలనే నీచమైన ఎత్తుగడ చంద్రబాబు వేశారు.ఈ నిర్ణయం వెంటనే ఎన్నికల కమిషన్ వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.