ప్రభుత్వ బడ్జెట్ సంక్షేమ బడ్జెట్ అని.. ప్రజలకు ఉపయోగపడే బడ్జెట్ అన్నారు ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. రాష్ట్ర బడ్జెట్‌పై ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. పేదల కోసం ఆలోచన చేస్తున్న ప్రభుత్వం ఇదన్నారు. వైద్య రంగానికి ప్రభుత్వం బడ్జెట్ లో ప్రత్యేకంగా నిధులు కేటాయించిందని తెలిపారు. విద్యకు తమ ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తుందని.. విద్యా రంగానికి 32 వేల కోట్లను ఈ బడ్జెట్ లో కేటాయించారని బొత్స సత్యనారాయణ తెలిపారు.
ఎక్కడ విద్యాధికులు ఉంటారో ఆ రాష్ట్రం ఎంతో వృద్ధి చెందుతుందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో వనరులను సమకూర్చుకోవడం కోసం ప్రత్యేకంగా అడుగులు వేస్తున్నామని.. సామాన్యుల కోసం సంక్షేమం అందించే విధంగా బడ్జెట్ రూపకల్పన చేశామని బొత్స సత్యనారాయణ చెప్పారు. గత ఐదేళ్లలో ఎన్నో ఆకలి చావులు…ఆత్మహత్యలు చూశామని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
తమ ప్రభుత్వం వచ్చాక ఈ నాలుగేళ్లలో ప్రజలు సంతోషంగా ఉన్నారని బొత్స తెలిపారు. ఉద్యోగులతో పని చేయించుకున్నప్పుడు జీతాలివ్వాల్సిన బాధ్యత ఉంటుందన్న ఆయన .. ఉద్యోగులంతా తమ కుటుంబ సభ్యులేనన్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను బడ్జెట్ లో కలిపి చూపాము అనడం లో వాస్తవం లేదన్నారు.
కాగా.. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ రోజు 2023-24 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రూ. 2,79,279 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రతిపాదించారు. అయితే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న సమయంలో టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగడంతో.. వారిని ఒక రోజు సభ నుంచి సస్పెండ్ చేశారు.
ఆ తర్వాత మంత్రి బుగ్గన తన బడ్జెట్ ప్రసంగాన్ని కొనసాగించారు. రెవెన్యూ వ్యయం రూ. 2,28,540 కోట్లుగా, మూల ధన వ్యయం రూ. 31,061 కోట్లుగా, రెవెన్యూ లోటు రూ. 22,316 కోట్లుగా, ద్రవ్య లోటు రూ. 54,587 కోట్లుగా, జీఎస్డీపీలో రెవెన్యూ లోటు 3.77 శాతంగా, ద్రవ్య లోటు 1.54 శాతంగా పేర్కొన్నారు.