బీజేపీపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. కేంద్రంలోని బీజేపీ మతతత్వ పార్టీ అని ఆయన అన్నారు. దేవుళ్ల పేరు చెప్పుకుని బీజేపీ రాజకీయం చేస్తోందన్నారు. పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుక్రవారం పర్యటించారు.
శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామిని ఆయన దర్శించుకున్నారు. నూతనధర్మకర్తల మండలి ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో పాలకుర్తిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానన్నారు.
దేశాన్ని పాలించగలిగే సత్తా ఒక్క సీఎం కేసీఆర్‌కు మాత్రమే ఉందని పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోని అభివృద్ధి, సంక్షేమంపై చర్చకు సిద్ధమా? అని ఆయన సవాల్ విసిరారు. మిషన్ భగీరథ మీద చర్చకు వస్తారా? గ్రామాల అభివృద్ధిపై చర్చకు సిద్దమా ? అని మంత్రి సవాల్ చేశారు.
దేశమంతా సీఎం కేసీఆర్‌ను ఆదర్శంగా తీసుకుంటోందన్నారు. కంటి వెలుగును తమ రాష్ట్రాల్లో అమలు చేస్తామని ఖమ్మం సభలోనే పలువురు సీఎంలు ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలోని ఆలయాలకు పూర్వ వైభవం తీసుకొస్తున్న వ్యక్తి సీఎం కేసీఆర్ అని అన్నారు.