కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. బీజేపీ – కాంగ్రెస్ పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ కంటే ఎక్కువ అభివృద్ధి జరిగినట్లు చూపిస్తారా? అంటూ ప్రశ్నించారు. మహబూబ్ నగర్ లో గురువారం సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ కంటే ఛత్తీస్గడ్, కర్ణాటకలో మెరుగైన సేవలు అందిస్తే తాను పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. అవసరం అయితే తాను రాజకీయాల నుండి తప్పుకుంటా అని దయాకర్ రావు వ్యాఖ్యానించారు.
లేకపోతే మీరు పదవుల నుంచి తప్పుకోవాల్సిన అవసరం లేదని.. క్షమాపణ చెబితే చాలు అన్నారు. ఈ ఛాలెంజ్ కు ఇద్దరు నేతలు సిద్ధమా? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ మహబూబాబాద్ అభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. మహబూబాబాద్ ని కేసీఆర్ జిల్లా చేశారన్నారు. మ్యానిఫెస్టోలో పెట్టుకున్న మహబూబాబాద్ కి మెడికల్ కాలేజీ ఇచ్చారన్నారు. కాంగ్రెస్ పాలిత, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గ్రామ పంచాయతీలను, తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయితీలను పరిశీలించి బేరీజు వేద్దామన్నారు.
తెలంగాణ పంచాయతీల కంటే మెరుగ్గా ఉంటే రాజకీయ సన్యాసం తీసుకుంటామన్నారు. గ్రామ సర్పంచ్ లను కాంగ్రెస్, బీజేపీలు రెచ్చగొడుతున్నారు. దేశంలో కేంద్రం ఇచ్చే అవార్డులు అన్నీ తెలంగాణకే వస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన డబ్బులు మళ్లించినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమన్నారు ఎర్రబెల్లి. ఇప్పటికే కేంద్రం నుండి గ్రామ పంచాయతీలకు రూ.700 కోట్లు రావాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ప్రతి నెల ఇవ్వాల్సిన నిధులను ఇస్తున్నామని చెప్పారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీలకు కేంద్రం ఎన్ని నిధులు ఇస్తుందో.. రాష్ర్ట ప్రభుత్వం కూడా అన్నే నిధులు ఇస్తోందని పేర్కొన్నారు. గురువారం 10 వేల మంది ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం ఉంటుందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కూడా వచ్చి కలెక్టరేట్ ను పరిశీలిస్తే బాగుంటుందని సూచించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.