తెలంగాణ పంచాయతీ రాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ తర్వాత తానే అత్యంత సీనియర్ అని ఆయన వెల్లడించారు.
గత 30 ఏండ్లుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నానని తెలిపారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఏ రంగంలో రాణించాలన్నా దానికి కృషి, పట్టుదల అవసరమని ఆయన పేర్కొన్నారు. తాను చిన్న తనం నుంచి వైద్యున్ని కావాలని అనుకున్నానని చెప్పారు. కానీ రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. క్రీడల్లోనూ తాను ముందుండే వాడినన్నారు.
తన తండ్రి గతంలో ‘సమితి ప్రెసిడెంట్’ పదవికి పోటీ చేశారని ఆయన వివరించారు. ఆ సమయంలో కాంగ్రెస్ టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి మరో వర్గంతో తన తండ్రిని ఓడించిందన్నారు. అలా కాంగ్రెస్ పై వ్యతిరేకతతో ఆ పార్టీపై కక్ష సాధించాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చానన్నారు.