మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫోన్ పోగొట్టుకున్నారు. జనగామ జిల్లా పర్యటనలో ఆయన ఫోన్ మాయమైంది. ఎవరికైనా మంత్రి ఫోన్ దొరికితే తెచ్చివ్వాలని అధికారులు కోరారు. కానీ ఎవరూ స్పందించక పోవడంతో ఫోన్ లేకుండానే వెనుదిరిగారు.
ఇంతకు ఏం జరిగిందంటే…. జనగామ జిల్లా చిల్పూర్ మండలంలో ఈ రోజు మంత్రి ఎర్రబెల్లి పర్యటించారు. చిల్పూర్ గుట్టపై బుగులు వేంకటేశ్వరస్వామి ఆలయంలో కళ్యాణోత్సవం నిర్వహించారు. ఈ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
గుట్ట పైన మూల విరాట్ ఆలయం నుంచి కింద ఏర్పాటు చేసిన కళ్యాణ వేదిక వద్దకు స్వామి వారి పట్టు వస్త్రాలను నెత్తిన పెట్టుకొని ఆయన కాలి నడకన వెళ్లారు. ఈ క్రమంలో కళ్యాణ వేదిక వద్ద తోపులాట జరిగింది. భక్తులు ఒకరిని ఒకరు తోసుకుంటూ దూసుకు వచ్చారు.
ఆ సమయంలో మంత్రి జేబులోని మొబైల్ ఫోన్ కింద పడింది. గుర్తు తెలియని భక్తుని చేతిలో ఆ ఫోన్ పడింది. మంత్రి ఫోన్ పోయిందని, ఎవరికైనా దొరికితే తెచ్చి ఇవ్వాలని అధికారులు మైక్ లో విజ్ఞప్తి చేశారు. మంత్రి కొద్ది సమయం కల్యాణ వేడుకలల్లో పాల్గొని హైదరాబాద్ కు బయలుదేరి వెళ్లారు.