బాల వికాసపై ఐటీ దాడులను తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఖండించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాల వికాస లాంటి సేవా సంస్థలపై ఐటీ దాడులు అమానుషమన్నారు. గత 25, 30 ఏళ్లుగా దేశ, విదేశాల నుంచి నిధులు సమకూరుస్తూ, నిస్వార్థ ప్రజా సేవ చేస్తున్న సంస్థ బాల వికాస పై దాడులు బాధాకరమని పేర్కొన్నారు.
బాల వికాస క్రిస్టియన్ మిషనరీ సంస్థ అవడం వల్లే ఈ ఐటీ దాడులు జరుగుతున్నాయన్నారు. ఈ ఐటీ దాడులు కక్ష్యసాధింపు చర్యలని పేర్కొన్నారు. లౌకిక, ప్రజా స్వామిక దేశంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మత రాజకీయాలకు పాల్పడుతోందన్నారు.
ఇలాంటి దాడులతో బాల వికాస లాంటి సంస్థల నిస్వార్థ ప్రజా సేవలను బీజేపీ ప్రభుత్వం అడ్డుకోవాలని చూస్తుందని తెలిపారు. భయబ్రాంతులకు గురిచేయడం ద్వారా ఆ సంస్థ సేవలను అపగలమా? అంటూ ప్రశ్నించారు. ఎందరో ప్రముఖులు ప్రశంసించిన బాల వికాస సంస్థపై ఐటీ దాడులు అవమానకరమన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.