వరంగల్ కేఎంసీ మెడికల్ స్టూడెంట్ ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటనపై బీజేపీ వాళ్లు అనవసరమైన తగాదాలు సృష్టిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రీతిని సైఫ్ వేధించాడని విచారణలో తేలిందని, వేధింపుల కారణంగానే ఆ అమ్మాయి ఇలాంటి నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు.
ప్రస్తుతం ప్రీతి పరిస్థితి విషమంగానే ఉందని తెలిపారు. ఆ యువతికి వైద్యులు మంచి వైద్యం అందిస్తున్నారన్నారు. ఆ అమ్మాయికి ఇదివరకు ఎలాంటి సమస్యలు లేవు కాబట్టి కోలుకునే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారని చెప్పారు.
సైఫ్ వేధింపుల వల్లే ఇలా జరిగిందని, దీనిని రాజకీయం చేయొద్దని, కావాలని రెచ్చగొట్టొద్దని కోరారు. సైఫ్ కి కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ప్రీతి తనకు బిడ్డ లాంటిదని వెల్లడించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.
కాగా కేఎంసీ మెడికో స్టూడెంట్ ప్రీతిని ఆమె సీనియర్ సైఫ్ వేధించినట్టుగా తమ దర్యాప్తులో తేలిందని సీపీ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. సైఫ్, ప్రీతి వాట్సాప్ చాట్ ల నుండి సమాచారం సేకరించినట్లు తెలిపారు. సైఫ్ గత నాలుగు నెలలుగా ప్రీతిని వేధిస్తున్నట్లు ఆధారాలున్నాయని స్పష్టం చేశారు. సైఫ్ వేధింపులు తట్టుకోలేకనే ప్రీతి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించిందని సీపీ వివరించారు.