– బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఎర్రబెల్లి హాట్ కామెంట్స్
– ప్రజా వ్యతిరేకత ఉందని ఒప్పుకున్న మంత్రి
– అలాంటివారిని పక్కనపెట్టేయాలని కేసీఆర్ కు సూచన
– చర్చనీయాంశంగా ఎర్రబెల్లి వ్యాఖ్యలు
కొన్నాళ్ల క్రితం బీఆర్ఎస్ కు పని చేస్తున్న ఐప్యాక్ సంస్థ ద్వారా పీకే ఓ సర్వే చేయించారు. అందులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని తేలింది. ఎవరిపై ఎంత వ్యతిరేకత ఉందో శాతాలవారీగా పీకే టీమ్ కేసీఆర్ కు రిపోర్ట్ అందించింది. దీంతో కేసీఆర్ ఎలాంటి స్టెప్ తీసుకుంటారో అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. కానీ, చివరకు ఆయన పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఢోకా లేదనే సంకేతాలు ఇచ్చారు. కానీ, దీనిపై అనేక వాదనలు ఉన్నాయి.
తెలంగాణలో బీజేపీ వలసలను బాగా ప్రోత్సహిస్తోంది. బీఆర్ఎస్ లో అసంతృప్తిలో ఉన్న నేతలకు ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటోంది. ఈ ప్రమాదాన్ని కేసీఆర్ ముందే పసిగట్టారు. సిట్టింగుల విషయంలో ఎలాంటి మార్పు ఉండదని చెబుతూనే.. మిగిలిన వారికి కూడా ఇతర పదవులను ఆశచూపి సైలెంట్ చేశారు. వలసలకు అడ్డుకట్ట వేయగలిగారు. అయితే.. మంత్రి ఎర్రబెల్లి తాజాగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
ఖమ్మంలో బీఆర్ఎస్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు జన సమీకరణలో భాగంగా మంత్రి డోర్నకల్ లో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో 75 నుంచి 100 సీట్లు గెలుస్తుందని జోస్యం చెప్పారు. అయితే.. కొంతమంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్న మాట వాస్తవమని చెప్పారు.
ఓ 25 మంది ఎమ్మెల్యేలను మారిస్తే బీఆర్ఎస్ కు 100 సీట్లు పక్కా అని అంటున్నారు ఎర్రబెల్లి. తాను వ్యక్తిగతంగా చేయించిన సర్వేల ఆధారంగానే ఇది చెబుతున్నట్లుగా పేర్కొన్నారు. తన సర్వేలు ఎప్పుడు తప్పు కాలేదని వివరించారు. ఎర్రబెల్లి వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీలో, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఖమ్మంలో నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగ సభకు ముందు ఈ కామెంట్స్ చేయడంతో మరింత ప్రాధాన్యం ఏర్పడింది.