ఉద్యమ నేతకు పదవీకాంక్ష పట్టుకుందా…? పదవి కాపాడుకునేందుకే ఉద్యమ గొడుగు పట్టుకుంటున్నారా…? తను సేఫ్ అనుకున్నాక ఎందుకు సైడ్ అవుతున్నారు…? రెండోసారి మంత్రి అయ్యాక ఎందుకీ మార్పు…? ఈసారి వేటు ఖాయమేనా …?
ఉద్యమంలో ముందుండి కొట్లాడిన నేతను ఉద్యమ పార్టీ పక్కన పెట్టిన ప్రతి సందర్భంలోనూ వెనకేసుకొచ్చారు ఉద్యమ కారులు. ముఖ్యంగా సోషల్‌మీడియా వేదికగా ఆ నేత కోసం పెద్ద పోరాటమే చేశారు. రెండోసారి మంత్రి పదవి వస్తుందో రాదో అన్న ఊగిసలాట సమయంలో గులాబీ బాస్‌కు సోషల్‌మీడియా వేదిక ద్వారా ఆ నేత పోరాటాన్ని, పార్టీ కోసం కష్టపడిన తీరును గుర్తు చేసి మంత్రి సీటు ఎక్కించారు. మధ్యలో వేటు ఖాయమే అని అంతా డిసైడ్ అయినా… మేము ఉద్యమకారులం, ఓనర్లం అంటూ గత జ్ఞాపకాలను గుర్తు చేసి… సేఫ్ ప్లేస్‌కు వెళ్లిపోయారు.
ఇలా తనకు అవసరం అనుకున్న సందర్భంలో తప్పా ఉద్యమ కార్డును తెరపైకి తెచ్చి పక్కనపెట్టేస్తున్నారు మంత్రి ఈటెల రాజేందర్. తనకు తన పార్టీయే కుల ముద్ర వేసి, కులానికే పరిమితం చేయాలనుకున్న సందర్భంలోనూ ఉద్యమకారులు అండగా నిలిచారు. తాను కూడా ఉద్యమ గొడుగు కింద సేద తీరుతూ… తనకు ఇబ్బంది కలగకుండా చూసుకున్నారు.
అయితే, ఇప్పుడు వెనకెసుకొచ్చిన ఈటెలను ఉద్యమకారులు తిట్టిపోస్తున్నారు. మంత్రి పదవి పోతుంది అని తెలియగానే… ఉద్యమకారుడని గుర్తుకువచ్చింది. మరీ… ఇప్పుడు నీ సహచర ఉద్యమకారులైన ఆర్టీసీ ఉద్యమకారుల కోసం నీ నోరు ఎందుకు పెకలటం లేదని ప్రశ్నిస్తున్నారు ఆర్టీసీ కార్మికులు. నీ కుర్చీకి ఎసరు వస్తనే ఉద్యమం గుర్తుకొస్తదా… మా ఇబ్బందులు కనపడటం లేదా అని ప్రశ్నిస్తున్నారు. పార్టీ జెండా మోసి ఉద్యమం చేసిన మీరు మీ పార్టీకి ఓనర్లయితే… బస్సును నడిపి ఉద్యమం చేసిన మేము ఆర్టీసీకి కిరాయిదార్లం ఎట్లయితం అని ప్రశ్నిస్తున్నారు.