తెలంగాణలోనూ సెకండ్ వేవ్ తీవ్రత అధికమవుతుండటంతో రాష్ట్రంలో లాక్‌డౌన్ లేదా కర్ఫ్యూ విధించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరగుతూ వస్తోంది. అయితే ప్రభుత్వం మరోసారి ఈ వదంతులపై తాజాగా స్పష్టత ఇచ్చింది. తెలంగాణలో లాక్‌డౌన్, కర్ఫ్యూకి ఎలాంటి అవకాశం లేదని, ఉండబోదని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తేల్చిచెప్పారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయన్న ఈటెల… ప్రజలు భయాందోళన చెందాల్సిన పనిలేదని చెప్పారు. కరోనా బారినపడుతున్న 95 శాతం మందిలో అసలు లక్షణాలే కనిపించడం లేదని చెప్పారు. అటు మరణాల రేటు కూడా చాలా తక్కువగా ఉందని వెల్లడించారు.
తెలంగాణలో వ్యాక్సినేషన్ వేగంగా నిర్వహిస్తున్నట్లు ఈటల స్పష్టం చేశారు. ప్రస్తుతం 50 వేల నుంచి 60 వేల మందికి టీకా ఇస్తున్నామని..ఈ సంఖ్యను రెట్టింపు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. టెస్టుల సంఖ్యను కూడా లక్షకు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రులు కరోనాఉ వ్యాపారకోణంలో చూడొద్దని కోరిన ఈటెల.. సాధ్యమైనంతవరకు ఫీజు తగ్గించి తీసుకోవాలని కోరారు.