తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్ తన పంథా ఏ మాత్రం వీడటం లేదు. సందర్భం దొరికినప్పుడల్లా టీఆర్ఎస్ అధిష్టానంపై పరోక్షంగా ఇంకా అసంతృప్తిని వెళ్లగక్కుతూనే ఉన్నారు. ఇటీవలే కేటీఆర్ రాయబారంతో కేసీఆర్- ఈటెల మధ్య సంధి కుదిరిందని అందరూ భావిస్తోంటే.. తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఈటెల.
వ్యవసాయ చట్టాలు, రైతుల ఆందోళన గురించి తాజాగా ఓ కార్యక్రమంలో ప్రసంగించిన ఈటెల.. తాను మంత్రినే కావొచ్చు కానీ అంతకంటే ముందు మనిషిని అంటూ నర్మగర్భంగా మాట్లాడారు. ప్రజల ఆకాంక్షల మేరకే ఏ ప్రభుత్వమైనా పనిచేయాలని.. ప్రజా ఉద్యమాలకు గొంతు కలపాల్సిన అవసరముందని గట్టిగా చెప్పారు. ఢిల్లీ రైతు బాధ ఏదో ఒకనాడు మన గడప కూడా తొక్కుతుందంటూ హెచ్చరించారు. అయితే ఈటెల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సీఎం కేసీఆర్ తీరుపై అనుమానాలు కలిగేలా చేస్తున్నాయి.
రైతు చట్టాలపై కేసీఆర్ యూటర్న్ తీసుకోవడంతో కేసీఆర్‌పై ఇటీవల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. ఈ విషయాన్ని పసిగట్టిన కేసీఆర్.. ఇటీవల అనూహ్యంగా ఎప్పటిలానే ఐకేపీ సెంటర్లలోనే ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు. అయితే తాజాగా ఈటెల చేసిన వ్యాఖ్యలు చూస్తోంటే .. కేసీఆర్ నిర్ణయం తాత్కాలికమేమోనని అన్న సందేహాలు కలుగుతున్నాయి. సాగర్ ఉప ఎన్నిక ఉన్నందునే ఒకవేళ ఈ ఒక్కసారికి గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు చేయబోతున్నారా అన్న అభిప్రాయాలు కలుగుతున్నాయి.
ఏదేమైనా ఈటెల వ్యాఖ్యలు చూస్తోంటే.. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికీ కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు అనుకూలంగా ఉందని అనిపిస్తోంది. అందుకే కేసీఆర్‌ను వారించలేక, ఆయనకు గట్టిగా తన అభిప్రాయాన్ని చెప్పలేక పరోక్షంగా ఏదో సందేశాన్ని ఆయన పంపుతున్నట్టుగా అనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. కాగా తాజా వ్యాఖ్యలు రవీంద్రభారతిలో జరిగిన బీసీ ఉద్యోగుల సంఘం డైరీ, కాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో చేశారు.