తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎట్టకేలకు తత్వం బోధపడినట్టుంది. రైతుల విషయంలో వీరావేశంలో నిర్ణయాలు తీసుకుంటే.. వాటి పర్యవసనాలు ఎలా ఉంటాయో అర్థమైనట్టుగా ఉంది. దీంతో ఆయన పరోక్షంగా దిద్దుబాటు చర్యలకు దిగినట్టుగా కనిపిస్తోంది. రెండు రోజులుగా రైతు వేదికలపై వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ చేస్తున్న పశ్చాత్తాపపు వ్యాఖ్యల వెనుక.. స్వయంగా కేసీఆరే ఉన్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
వ్యవసాయశాఖపై ఆ మధ్య నిర్వహించిన సమీక్షలో ఐకేపీ సెంటర్లను ఎత్తివేస్తున్నట్టు ప్రకటించడంతో.. సీఎం కేసీఆర్ ఇప్పటికీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. పార్టీ నేతలైతే క్షేత్రస్థాయిలో తిరగలేని పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ధాన్యం కొనుగోళ్లు చేయలేనప్పుడు ప్రభుత్వం ఎందుకు అని రైతులు వారిపై తిరగబడుతున్నారు. ఈక్రమంలోనే సోమవారం ఓ కార్యక్రమంలో..ఐకేపీ సెంటర్లను కొనసాగించేలా కేసీఆర్‌తో మాట్లాడతానంటూ చెప్పారు. ఇక మరుసటి రోజే (నిన్న) కేసీఆర్‌ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎవరిపై కోపంతోనే కేసీఆర్ ఐకేపీ సెంటర్లు ఎత్తివేస్తున్నట్టు ప్రకటించారని.. కానీ రైతులపై ఆయనకు చాలా ప్రేమ ఉందని మాట్లాడారు. ఈటెల మాటలు చూస్తోంటే.. కేసీఆర్ తన తప్పిదాన్ని నేరుగా అంగీకరించలేక ఇలా మంత్రులతో వాటిని సరిదిద్దుకునే ప్రయత్నాలు చేస్తున్నారని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు.