రోడ్ సేఫ్టీపై ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, కొత్తగా ఎంత టెక్నాలజి వాడినా రోడ్డు ప్రమాదాలను మాత్రం నియంత్రించలేకపోతున్నారు. వాహన చట్టాలతో పాటు ఎన్నో కఠిన నిబంధనలు తెచ్చినా నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం అధికారికంగా చెప్పిన గణంకాలు ఆందోళన కలిగించేలా ఉన్నాయి. దేశంలో ఉన్న మొత్తం డ్రైవింగ్ లైసెన్సుల్లో 30శాతం లైసెన్సులు నకిలీవేనని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా వెల్లడించారు. నాగ్‌పుర్‌లో జాతీయ భద్రతా ప్రచారంలో ఆదివారం పాల్గొన్న గడ్కరీ ఈ విస్తుపోయే నిజాన్ని వెల్లడించారు.
దేశంలో బోగస్ లైసెన్స్‌లు పొందటం ఇప్పుడు చాలా సులభమైందని, డబ్బులివ్వడం ద్వారా ఎవరో ఒకరు ఆర్టీఓ ఆఫీస్ నుంచి డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పిస్తున్నారన్నారు. అయితే ఇప్పుడు ఫాస్డాగ్తో నకిలీ లైసెన్స్‌లకు అడ్డుకట్ట పడే అవకాశాలున్నాయన్నారు. ఫాస్టాగ్‌కు సంబంధించిన గడువును పొడిగించేది లేదని కూడా నితిన్ గడ్కరీ స్పష్టంచేశారు. వాహన యజమానులు వెంటనే ఫాస్టాగ్‌ను తీసుకోవాలని సూచించారు.
ఈనెల 15తో ఫాస్టాగ్ గడువు ముగియనుంది.